సిటీబ్యూరో, ఆగస్ట్ 22(నమస్తే తెలంగాణ) : ఫ్రీ ట్రేడింగ్ లింక్స్‌లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ ఆశచూపి రూ.1.05కోట్లు కొట్టేసిన ఆరుగురు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చైనాకు చెందిన చెన్చెన్గా గుర్తించగా అతడు పరారీలో ఉన్నారు. మిగతా నిందితులైన అద్దులపురి హర్షవర్ధన్, కొండూరు వేణు, మైలారం ప్రదీప్, పచ్చిపాల వినోద్‌యాదవ్, పరసనబోయిన వంశీ, మంగళి లక్ష్మణ్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై వరకు తార్నాకకు చెందిన 34ఏళ్ల మహిళను నేరగాళ్లు ఎన్ఎస్ఈ, కాయిన్ఎస్ఎస్డీసీఎక్స్లలో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా ఆన్లైన్ టాస్క్‌లతో పాటు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ద్వారా పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించారు. నమ్మించడానికి మొదట్లో కొన్ని లాభాలు ఇచ్చారు. దీంతో మహిళ టార్గెట్ అప్రూవల్స్, టాక్స్ క్లియరెన్స్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.1,05 కోట్లు పంపించారు. తర్వాత తాను మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏసీపీలు శివమారుతి, జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, ప్రతాప్, అబ్సర్, వీరబాబులు కేసును ఛేదించారు. నేరగాళ్లు తాము కొట్టేసిన డబ్బులను పలురకాలుగా మార్చేవారని పోలీసులు తెలిపారు. మంగలిలక్ష్మణ్ ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా సైబర్‌క్రైమ్ కొనసాగించేవాడని, ఆ ఖాతాలో డబ్బులు పడగానే తన ఏటీఎంకార్డును వినోద్యాదవ్కు ఇస్తే అతడు ఆ కార్డును ప్రదీప్‌కు ఇచ్చేవారని అతడు 4 శాతం కమీషన్ తీసుకునేవాడు. ఆ తర్వాత ఏటీఎం కార్డులను నేరస్తులకు సర్కులేట్ చేసేవారని పోలీసులు తెలిపారు. వీరంతా డబ్బులను ఏటీఎంలలో, పెట్రోల్ బంకులలో విత్ డ్రా చేసుకునేవారని, ఆ తర్వాత తమకు రావలసిన డబ్బులు తీసుకుని మిగతావి చైనాకు చెందిన ప్రధాన నేరగాడు చెన్చెన్కు పంపేవారని తెలిపారు. ఈ కేసులో అరస్టైన ఆరుగురు నేరస్తులు 50కి పైగా బ్యాంక్ అకౌంట్లతో కోట్ల రూపాయల సైబర్‌నేరాలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి డెబిట్‌కార్డులు, పాస్‌బుక్స్, చెక్‌బుక్స్, మొబైల్ ఫోన్లు, ఫింగర్‌ప్రింట్ మిషన్, స్కానర్ స్వాధీనం చేసుకున్నామని సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు.
మన్సూరాబాద్ : పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మించి మోసం చేశారు. సీఐ మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, వెంకటగిరి కోటకు చెందిన ఖాన్ రియాజ్ మణికొండలో నివాసముంటున్నాడు. చిక్కడపల్లికి చెందిన సురేశ్, రియాజ్ స్నేహితులు. ఇద్దరు కలిసి 2024లో మామ మెటల్స్ పేరుతో నాగోల్ చౌరస్తాలో కంపెనీని స్థాపించారు. లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రూ. 2 వేలు ఇస్తామని.. 100 రోజుల్లో రెట్టింపవుతుందని..
దుబాయ్ నుంచి బంగారం తెప్పించి తక్కువ ధరలో ఇస్తామంటూ ఖాన్ రియాజ్, సురేశ్ చేసిన చేసిన ప్రకటనలతో ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో అనేక మంది కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో పెట్టుబడులు పెట్టిన డబ్బులకు లాభాలు ఇచ్చారు. కాగా అధిక మొత్తంలో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితులు ఈ మధ్య కాలంలో కనిపించకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాన్ రియాజ్, సురేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.