మేడ్చల్, అక్టోబరు 6 : రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలుకాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో 44వ నెంబరు జాతీయ రహదారి ప్రభుత్వ ఐటీఐ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పూజారి పాలెం గ్రామానికి చెందిన అంబటి శ్రీను, భార్య అంబటి కళావతి(35) మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లిలో నివాసం ఉంటున్నారు. వారిద్దరూ మేడ్చల్ నుంచి అత్వెల్లి వైపు సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.
అదే సమయంలో మేడ్చల్లో నివాసం ఉండే రాజిరెడ్డి(48) మరో వాహనంపై వస్తున్నారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలను వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని కంటైనర్ ప్రభుత్వ ఐటీఐ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు కింద పడిపోగా కంటైనర్ చక్రాలు కళావతి తలపై నుంచి వెళ్లాయి. దీంతో అమె తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనుతోపాటు రాజిరెడ్డికి గాయాలు కాగా, వారిద్దరినీ చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాజిరెడ్డి కూడా మృతి చెందాడు.