జీడిమెట్ల, జూన్ 6: బాచుపల్లి మియాపూర్ రహదారిలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృత దేహం కలకలం రేపిన ఘటనలో నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం షాపూర్ నగర్‌లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ కె.సురేశ్ కుమార్ వివరాలను వెల్లడించారు. నేపాల్ దేశానికి చెందిన విజయ్ తోపా(26) రెండు నెలల కిందట నేపాల్ నుంచి ఇద్దరు పిల్లల తల్లి తారాబెహరా(33)తో అక్రమ సంబంధం పెట్టుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు.
అతడు బౌరంపేట్లోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తారా బెహరా 2 నెలల గర్భవతి కావడంతో విజయ్ తోఫాతో గొడవ జరిగింది. ప్రెగ్నెంట్ విషయంలో ఇద్దరికి గొడవ జరుగుతున్న నేపథ్యంలో తారా బెహరా మెడకు విజయ్ తోపా చున్నీ చుట్టి మే 23వ తేదీన హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి రెడ్డి ల్యాబ్స్ పక్కన పడేసి వెళ్లాడు. దీంతో ట్రావెల్ బ్యాగ్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రావెల్ బ్యాగ్‌ను తెరిచి చూడగా.. అందులో ఓ మహిళ మృతదేహం బయటపడింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుని విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు విజయ్ తోపాని రిమాండ్‌కు తరలించారు. మహిళ హత్య కేసును 24 గంటలలో ఛేదించిన బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులను డీసీపీ అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీ రవికిరణ్ రెడ్డి, బాలానగర్ ఎస్ఓటీ సీఐ శివకుమార్, బాచుపల్లి సీఐ ఉపేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.