కుత్బుల్లాపూర్, నవంబర్14: బెట్టింగ్‌లో నష్టపోయి.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మద్యానికి బానిసయ్యాడు. ఏం చేయాలో తోచక దొంగతనాల బాట పట్టాడు. దీని కోసం బంధువైన ఓ మహిళపై కన్నేసి.. ఎలాగైనా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కొట్టేయాలని పధకం వేశాడు. చివరకు ఆ మహిళను హత్య చేసి బంగారంతో ఊడాయించి ఆమె కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చిన ఆ నిందితుడు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. బాలానగర్ జోన్ డీసీపీ కె.సురేశ్‌కుమార్ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన యెరమల దేవేందర్‌రెడ్డి భార్య నిహారిక(21)తో కలిసి ఏడాదిన్నరగా జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఖమ్మం ప్రాంతానికి చెందిన నిందితుడు బొగ్గుల శివమాధవరెడ్డి(21) నగరంలోని ఎస్ఆర్నగర్లో ఉండేవాడు. గత కొన్నేండ్ల నుంచి ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన శివమాధవరెడ్డి చేసిన అప్పులు తీర్చేందుకు సమీప బంధువు అయిన నిహారిక వద్ద ఉన్న బంగారాన్ని, ఇంట్లో ఉండే నగదును అపహరించాలని పధకం వేశాడు. అయితే దేవేందర్‌రెడ్డి ఉదయం పనిపై బయటకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చేవాడు.
భర్త లేని సమయంలో శివమాధవరెడ్డి ఈనెల 12వ తేదీన నిహారిక ఇంటికి వెళ్లి ఆమెతో మాటలు కలిపి కత్తితో నిహారిక హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని బంగారు చెవిపోగులు, మంగళసూత్రం, చైన్, మరో జత చెవిపోగులు, మూడు ఉంగరాలు, రూ.2,500 నగదును దోచుకెళ్లాడు. అయితే కేసును తప్పుదోవ పట్టించేందుకు బాత్రూంలో ప్రమాదవశాత్తు పడిందని చిత్రీకరించేందుకు నిందితుడు మృతదేహాన్ని బెడ్రూం నుంచి తీసుకెళ్లి బాత్రూమ్ వద్ద పడేసి తప్పించుకుపోయాడు. అపహరించిన బంగారాన్ని స్నేహితుడి సాయంతో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌లో తనఖా పెట్టి రూ.3 లక్షల 6వేలు తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.