సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సింగపూర్‌లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సుదీంద్ర కథనం ప్రకారం.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఏరువ అభిషేక్‌రెడ్డి గతంలో సింగపూర్‌కు జాబ్ వీసాపై వెళ్లి వచ్చాడు. అదే అనుభవంతో హిమాయత్‌నగర్‌లోని కుబేరా టవర్‌లో జేఎంజేరెడ్డి పేరుతో జాబ్ కన్సల్టెన్సీ ప్రారంభించాడు.
ఇతనికి కరీంనగర్‌కు చెందిన తుమ్మ చిన్నమ్మ అనే మహిళ సహకారం అందిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకునే వారిని ఆకర్షిస్తూ సింగపూర్‌లో మంచి ఉద్యోగాలిప్పిస్తామని, వీసా, ప్లేస్మెంట్ మొత్తం చేయిస్తామంటూ నమ్మిస్తారు. వీరి మాటలు నమ్మి సుమారు 25 మంది వరకు వారిని సంప్రదించగా, నిరుద్యోగుల నుంచి రూ. 83 లక్ష ల వరకు వసూలు చేశారు.
డబ్బులు వసూ లు చేసిన తరువాత కన్సల్టెన్సీలో ఉండకుం డా, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా దాటవేత ధోరణిని ప్రదర్శిస్తూ తప్పించుకు తిరుగుతూ తమ కార్యాలయాన్ని అల్వాల్‌కు మార్చారు. బాధితులు నారాయణగూడ, అల్వాల్ పోలీస్స్టేషన్లలోనూ ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇద్దరు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదులు బృందం రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు.