జూబ్లీహిల్స్, జూన్ 12: వర్షాలు మొదలవుతుండడంతో కృష్ణానగర్‌లో ఆక్రమణలు తొలగించేదెప్పుడు.. పూడికతీసేదెప్పుడు అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు లైట్‌గా తీసుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. వర్షాలు రాకముందే పనులు పూర్తిచేయకపోతే గతంలో ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం అవుతాయన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా కృష్ణానగర్.. వెంకటగిరి ప్రాంతాలలో నాలాపై నిర్మాణాలు తొలగించి పూడికతీస్తామని చెప్పిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది ముంపు సమస్యకు ముగింపు పలకడం కష్టసాధ్యంగా మారనున్నది.
నాలాపై ఆక్రమణలతో దశాబ్దాలుగా పూడికతీత లేక ఎగువ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, హైలం కాలనీ, వెంకటగిరి తదితర ప్రాంతాల నుంచి వచ్చే వరద కృష్ణానగర్‌లో రోడ్లపై నిలిచిపోతుంది. అయితే ఈ ప్రాంతాలలో నాలాపై నిర్మాణాలు తొలగిస్తేనే పూర్తిస్థాయిలో పూడికతీయడం సాధ్యపడుతుందని అధికారులు గుర్తించారు. ముంపు సమస్య నుంచి గట్టెక్కించేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో సర్వే చేసిన ప్రత్యేక బృందాలు 10 అడుగుల లోతులో ఉన్న నాలాలో 7 అడుగుల మేర సిల్ట్, మట్టి, ఇతర వ్యర్థాలు నిండిపోయాయని తేల్చి చెప్పారు. అయితే నాలాపై పాక్షికంగా ఉన్న ఆక్రమణలు తొలగించడంతో పాటు నాలాను పూర్తిగా ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలకు వెకేషన్ నోటీసులిచ్చి తొలగిస్తామని చెప్పిన అధికారులు..మళ్లీ దాని ఊసే ఎత్తడం లేదు.
వర్షాకాలం రాకముందే పనులు పూర్తిచేసి వరద ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన హైడ్రా అధికారులు పూడికతీత కోసం నాలాలు పగులగొట్టి కొత్త సమస్యకు తెరలేపారు. ఈ పనుల్లో ప్రీ కాస్ట్ శ్లాబ్‌లు, బాక్స్ డ్రైన్లు తవ్వినప్పుడు సాలిడ్ వేస్ట్ వ్యర్థాలు నాలాలో పడిపోయి పూడికతీత కష్టసాధ్యంగా మారిందన్న వాదన వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో పూడిక తొలగించి కృష్ణానగర్‌ను వరద ముంపు సమస్య నుంచి గట్టెక్కించడం అసాధ్యంగానే మిగిలిపోనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రధాన ప్రచారాస్త్రంగా మారిన కృష్ణానగర్ ముంపు సమస్య నేటికీ అపరిష్కృతంగా ఉండడం గమనార్హం. కాగా, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పినా.. అది ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. అయితే కృష్ణానగర్‌లో అప్పుడప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు పనులు పూర్తిచేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నారు.