MP High Court : మసీదు కమిటీ ఫత్వా (Fatwa) పై మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhyapradesh High Court) కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా మిషనరీలకు లేదని స్పష్టంచేసింది. కేవలం మసీదు కమిటీ జారీచేసిన ఫత్వా ఆధారంగా వివాహ బంధం రద్దు అయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి రాజ్యాంగబద్ధమైన ఫ్యామిలీ కోర్టుల (Family Courts) ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొన్నది.
ఈ మేరకు జస్టిస్ వివేక్ జైన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా భోపాల్ ‘దారుల్-దఫా మసాజిద్ కమిటీ’ జారీ చేసిన ఫత్వా ఆధారంగా తన వివాహ బంధం రద్దు అయినట్లు ప్రకటించాలని కోరిన ఓ భర్త అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ఫత్వాకు స్వతంత్రంగా చట్టపరమైన గుర్తింపు లేదని, అది కోర్టు తీర్పునకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టంచేసింది. వివాహం రద్దు వంటి అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కోర్టులకే ఉంటుందని వెల్లడించింది.
అయితే విడాకులు కోరే వ్యక్తికి చట్టప్రకారం సంబంధిత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకులు పొందే హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. వివాహ రద్దు పిటిషన్ దాఖలు చేస్తే, దానిని సంబంధిత కోర్టు నిబంధనల ప్రకారం విచారిస్తుందని పేర్కొన్నది. కాగా ఈ తీర్పు మతపరమైన ఫత్వాల చట్టబద్ధత, వివాహ రద్దు ప్రక్రియపై కీలకమైన స్పష్టతను ఇచ్చిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.