సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో పదోన్నతుల తో ఆ శాఖకు చెందిన విభిన్న వర్గాల పంట పండింది… ఒక్కోపోస్టు దాని ప్రాధాన్యతను బట్టి భలే రేటు పలికింది… నగరశివారు ప్రాంతాల్లో ఫోకల్ పోస్టులకు రూ.20లక్షలకు పైగా డబ్బులు చేతులు మారాయంటూ మింట్‌కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది. పదోన్నతుల పేరుతో ఇచ్చిన ఉత్తర్వుల వెనక జరిగిన వ్యవహారంపై విద్యుత్ ఉద్యోగులు బహిరంగంగానే చర్చిం చుకుంటున్నారు.
ఇంజినీర్లకు , అకౌంట్స్ ఆఫీసర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఎస్పీడీసీఎల్ యాజమాన్యం సోమవారం 24తో ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మంగళవా రం 25 రాత్రి ఉత్తర్వులు బయటకువచ్చాయి. సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాత తేదీలపై టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం పదోన్నతులు పొందినవారికి వ్యక్తిగతంగా ఉత్తర్వులు అందించారు. అయితే పదోన్నతులను అడ్డంపెట్టుకుని యాజమా న్యం అక్రమ బదిలీలకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. పదోన్నతులు కల్పించిన వారికి ఖాళీగా ఉన్న పోస్టులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు ఇవ్వడంలో సంబంధిత మంత్రి సహకారంతో డిస్కం హెచ్ఆర్విభాగం చక్రం తిప్పిందంటూ గుసగుసలాడుకుంటున్నారు.
ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు..!
ఎస్పీడీసీఎల్లో జరిగిన ప్రమోషన్లలో ముడుపుల బాగోతం నడిచిందంటూ ఉద్యోగులంతా చెవులు కొరుక్కుంటున్నారు. సాధారణంగా జరిగేదానికంటే ఇప్పుడు మరింత ఎక్కువగా రేటు పలికిందనే చర్చ జరుగుతోంది. ఈ ప్రమోషన్లలో ఏఈ నుంచి ఏడీఈ, ఏడీఈ నుంచి డీఈ, డీఈ నుంచి ఎస్ఈ , ఎస్ఈ నుంచి సీఈల వరకు, అకౌంట్స్ విభాగంలో జేసీ, ఏవోలకు సైతం పదోన్నతులు పొందినవారికి వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అదనుగా కొంతమంది ఇంజినీర్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడం గమనార్హం. వాస్తవానికి ఖాళీ పోస్టులను పదోన్నతి పొందిన వారికి కేటాయించా లి. సంబంధిత శాఖ మంత్రి చెప్పారని కొంతమంది ఇంజినీర్లను నిబంధనలకు విరుద్ధంగా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం బదిలీలు చేయడం విద్యుత్ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ బదిలీలు చేసినా ఒకేచోట మూడుసంవత్సరాలు దాటిన వారికి అవకాశం కల్పిస్తే బాగుండేదని. కానీ రెండుసంవత్సరాలలోపు వారినే కాకుండా గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారికి మరోసారి కీలకపోస్టులు ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఈ పోస్టులకు ప్రాధాన్యతను బట్టి మరీ ముఖ్యంగా కొన్ని శివారు ప్రాంతాలు, కీలక స్థానా లకు రూ.20నుంచి రూ.50లక్షల వరకు కూడా ధర పలికిందనే చర్చ జరుగుతోంది.
డిస్కంలో ఏడీఈ స్థాయి అధికారులు మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఒకేచో ట పనిచేసిన వారు చాలామంది ఉన్నారు. వీరు కాకుండా ఏఈ నుంచి ఏడీఈగా పదోన్నతి పొందినవారు 45మంది ఉన్నప్పటికీ గత ఏడాది నాన్‌ఫోకల్ పోస్టుకు వెళ్లిన ఏడీఈకి నగరశివారులోని ఒక కీలక ప్రాంతానికి ఏడీఈగా బదిలీ చేశారు. సదరు ఏడీఈ ఐటీ సెక్టార్లో ఏడీఈగా పనిచేసిన సమయంలో అలాంటి వ్యక్తికి శివారు కీలక ప్రాంతానికి ఏడీఈగా బదిలీ చేయడం వెనక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ప్రచారం జరుగుతోంది. దాదాపుగా పది డిస్కమ్‌ల పరిధిలో పది పోస్టుల్లో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలకు అవకాశం కల్పించారు.
అక్రమాలు బయటపడకుండా..!
బదిలీల సమయంలో ఉన్నతస్థాయిలో జరుగుతున్న అక్రమాలతో ఈ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో వినియోగదారులను డబ్బులు డిమాండ్ చేస్తుండడం, దీంతో ఏసీబీ కేసులు పెరుగుతున్నాయని ఒక సీనియర్ విద్యుత్ అధికారి చెప్పారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 20 వరకు ఉండడంతో ఆ తర్వాత మార్గదర్శకాలు విడుదల చేసినా ఇక బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని, ఈ ఏడా ది బదిలీలు ఉండే అవకాశం లేదని ఆ అధికారి చెప్పారు. పదోన్నతుల సాకుతో ఇచ్చిన ఈ బదిలీలు ప్రస్తుతం విద్యుత్‌శాఖలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఓ అండ్ ఎం విభాగం ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోలేదని, క్షేత్రస్థాయిలో పనిచేసేది తామే అయినా కనీసం కేడర్‌కు పదోన్నతులు కల్పించకపోవడంపై విద్యుత్ ఉద్యోగుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా యి. పదోన్నతులను కేవలం అధికారుల వరకే పరిమితం చేసి ఉద్యోగులను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.