Manikonda | మణికొండ, ఏప్రిల్ 19: మణికొండ మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేశాయి. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం కాసులకు అలవాటై ప్రజాసమస్యలను పట్టించుకోవడం మానేశారంటూ సెక్రటేరియట్ కాలనీ వాసులు మండిపడుతున్నారు. శనివారం మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్‌మార్నింగ్ మణికొండ- ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా సెక్రటేరియట్ కాలనీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు అనేక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.
తమ కాలనీలో తాగునీటి సరఫరా సరిగ్గా లేదని, దీనికి తోడు జలమండలి శాఖ లైన్మెన్లు చేతివాటానికి అలవాటై సమస్యలను పరిష్కరించడం లేదని కాలనీ వాసులు మండిపడ్డారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజీ సమస్యలు అధికంగా ఉన్నాయని, ఫలితంగా ఇళ్లలోని ప్రిడ్జ్‌లు, టీవీలు ఇతర ఎలక్ట్రికల్ సామాగ్రి కాలిపోతున్నాయని తెలిపారు. చారిత్రాత్మక గండిపేట చెరువు నుంచి నగరానికి తరలించి నీటి కాలువ(కాండూట్) సెక్రటేరియట్ కాలనీ పరిధిలో చిల్లులు పడి కిలోమీటర్ల పొడవునా నీరు ప్రవహిస్తోందన్నారు. ఇదే విషయాన్ని జలమండలిశాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కాలనీల ప్రధాన రహదారుల్లో రాత్రిపూట కొంతమంది ఆకతాయిలు బైక్‌లపై అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాల చేస్తున్నారని, మహిళలు, యువతులపైకి వాహనాలను తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. కాలనీ ప్రధాన వీధుల్లో అపరిశుభ్రత తిష్టవేసిందని శుభ్రపర్చాలని మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పుప్పాలగూడ పైప్‌లైన్ రోడ్డులో మద్యం షాపుల నిర్వహణతో ప్రతి రోజు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని జనజీవన పరిధిలో మద్యం షాపులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్రటేరియట్కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరపున అధికారులను కలిసి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ అన్నారు.