హైదరాబాద్: మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్లో వరుసగా నాలుగు రోజుల పాటు వైన్ షాపులు బంద్ (Wine Shops Close) కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హైదరాబాద్లో జిల్లాలో నాలుగు రోజులు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 9 నుంచి 12 వరకు వైన్ షాపులు తెరచుకోవని అధికారులు తెలిపారు. నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు (నవంబర్ 12) వరకు కొనసాగుతాయని వెల్లడించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్ 14న ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు, అవసరమైతే రిపోల్ రోజు కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సతిమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ పార్టీ బరిలో నిలిపింది. ఆమె విజయం కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.