రామచంద్రాపురం,నవంబర్ 21 : సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ నుంచి ఉస్మాన్‌నగర్ వరకు ఏర్పాటు చేసుకున్న పలు షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 6గంటల నుంచే కూల్చివేతలు చేపట్టారు. కొల్లూర్ ఇన్స్పెక్టర్ గణేశ్ పటేల్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పది వరకు కమర్షియల్ షెడ్లను తొలిగించారు.
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు షెడ్లను కూల్చివేస్తుండడంతో యజమానులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్ల నిర్మాణాలు జరిగేటప్పుడు అధికారులు ఎందుకు స్పందించలేదని, నిర్మాణ దశలోనే పనులు నిలిపేస్తే తమకు ఇంత నష్టం జరిగేది కాదని బాధితులు అధికారుల తీరుపై మండిపడ్డారు.
తమ వ్యవసాయ భూములను రోడ్డు కోసం ఇచ్చామని, తమ స్థలంలోనే బతుకుదెరువు కోసం ఒక షెడ్ నిర్మాణం చేసుకుంటే, మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించి కూల్చివేయడం ఏమిటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా షెడ్ల కూల్చివేతలపై తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించమని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కమర్షియల్ షెడ్లపై అనేక ఫిర్యాదులు రావడంతోనే కూల్చివేతలు చేపట్టామని చెప్పారు.