తాగిన మత్తులో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. తన సోదరుల సాయంతో కట్టుకున్న భర్తను చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టి చంపేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్పహాడ్ గ్రామం నార్లకుంట తండాకు చెందిన జటావత్ నరేందర్(40)కు 16 ఏళ్ల క్రితం సోనీతో వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన దంపతులు అన్నోజిగూడలోని లక్ష్మీనరసింహ కాలనీలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిలో కుమారుడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. కుమార్తె తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. కాగా, నరేందర్, సోనీ ఇద్దరికి మద్యం సేవించే అలవాటు ఉంది.
వారి సంపాదన మొత్తం తాగడానికే ఖర్చవుతుండటంతో కుటుంబపోషణ కష్టమైంది. అదే విషయంలో తాగిన మత్తులో ఇద్దరు గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నరేందర్ నిద్రపోయిన తర్వాత తన సోదరులు నానావత్ రమేశ్, నానావత్ భాస్కర్ల సహకారంతో నరేందర్ మెడకు చీరతో ఉరివేసి, తలను నేలకేసి కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో నరేందర్ మృతి చెందాడు. దీనిపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.