బంజారాహిల్స్,మే 23: ఎప్పుడూ మీ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావా.. బాబును పట్టించుకోవా అని భర్త మందలించినందుకు భార్య పెద్ద గొడవ చేసింది. అంతటితో ఆగకుండా తన కుటుంబసభ్యులను పిలిపించింది. ఈ క్రమంలో ఇంటికొచ్చిన బామ్మర్దులు.. బావ అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట సమీపంలోని సక్కుబాయినగర్లో నివాసం ఉండే మనీశ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ప్రియాంక అనే యువతితో పెళ్లయింది. వారికి ఏడాది బాబు ఉన్నాడు. అయితే కొంతకాలంగా ప్రియాంక తన తల్లితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ బాబును సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇది గమనించిన మనీశ్ ప్రియాంకను మందలించారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ప్రియాంక ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు మనీశ్ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మనీశ్ కుటుంబసభ్యులు, ప్రియాంక కుటుంబసభ్యలకు మధ్య మాటామాటా పెరగడంతో పెద్ద గొడవ జరిగింది.
ఈ గొడవలో భాగంగానే మనీశ్‌పై అతని బామ్మర్దులు విశాల్, రోహిత్ దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన మనీశ్ సోదరుడు కార్తీక్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులపై సైతం దాడి చేశారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిలింనగర్ పోలీసులు బీఎన్ఎస్ 115(2), 127(2),329(4), రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.