Crime News | బేగంపేట్, ఫిబ్రవరి 9: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవ పడి కోపంతో భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్కెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ప్యాట్నీలోని కామాక్షి సిల్క్స్ షాప్ లోనే భర్త శ్రవణ్ నిప్పు పెట్టుకున్నాడు. భార్య మౌనిక షాప్‌లో పని చేస్తుండగా భార్యతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో శ్రవణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న మార్కెట్ పోలీసులు షాప్ దగ్గరికి చేరుకుని, తీవ్రంగా కాలిన గాయాలతో శ్రవణ్‌ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో వినియోగదారులు ఉండగానే ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు.
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్, ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దుకాణంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరయ్యారు. అప్పటికే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో చెలరేగిన మంటలను పొగలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎందుకు ఘర్షణ జరిగిందన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.