Mayor Vijayalakshmi | సిటీబ్యూరో/అల్లాపూర్/బాలానగర్, జనవరి 8(నమస్తే తెలంగాణ): ఒక్క నియోజకవర్గం పర్యటనలో రెండు చేదు అనుభవాలు నగర మేయర్‌కు ఎదురయ్యాయి. కూకట్పల్లి నియోజకర్గంలో బుధవారం పర్యటించిన మేయర్ విజయలక్ష్మికి రెండు వేర్వేరు ఘటనలు షాకిచ్చాయి. ఊహించని రీతిలో ఎదురైన ఘటనలపై మేయర్ ఆశ్చర్యపోయారు. వారు సంధించిన ప్రశ్నలకు ఏం చేయాలో? ఏ విధంగా సమాధానం ఇవ్వాలో అర్థం కాక కొద్ది సేపు మౌనంగా ఉండిపోయారు.
ఆ తర్వాత తనదైన శైలిలో అధికారులపై, ఇటు కాంగ్రెస్ లీడర్లపై చురకలు అట్టించారు. మధ్యలో కాలనీ, బస్తీ పర్యటనల సందర్భంగా స్థానికులు మేయర్‌కు అడుగడుగునా సమస్యల స్వాగతం పలకడం గమనార్హం. మొత్తంగా మేయర్ పర్యటన రోజంతా విస్తృత చర్చకు దారి తీసింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల వినతి మేరకు గడిచిన రెండు రోజులుగా మేయర్ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్, అల్లాపూర్ డివిజన్లలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి మేయర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సందర్శించారు.
బాలానగర్ డివిజన్ పర్యటన సందర్భంగా మేయర్‌ను స్థానిక కాంగ్రెస్ నాయకులు మేయర్‌ను అడ్డుకుని నిలదీశారు. ఆ తర్వాత అల్లాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారుల నుంచి రూ.500లు వసూలు చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని మేయర్‌ను లబ్ధిదారులు నిలదీశారు. మేయర్‌ను చుట్టుముట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన జోనల్ అధికారులు హౌజింగ్ సర్వే (రిసోర్స్ పర్సన్) అనితను డీసీ వంశీకృష్ణ సస్పెండ్ చేశారు.
పైసలు ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పరిశీలిస్తమని, లేకుంటే మీకు ఇండ్లు రావని అధికారులు తమను బెదిరిస్తున్నరని అల్లాపూర్‌లో పర్యటించిన మేయర్‌ను చుట్టుముట్టిన మహిళలు అధికారుల పనితీరుపై ప్రశ్నల వ ర్షం కురిపించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు పరిశీలనలో కొందరు అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, దయచేసి ఇం డ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు దక్కేలా చూడాలని న్యూ అల్లాపూర్‌కు చెందిన మహిళలు మేయర్ వద్ద మొర పెట్టుకున్నారు.
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పింఛన్లు, రేషన్ కార్డులు, మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? అని మేయర్‌ను నిలదీశారు. ప్రజలు సంధించిన ప్రశ్నలకు అవాక్కైన మేయర్ ఏం చెప్పాలో పాలుపోక కొద్దిసేపు మౌనం వహించక తప్పలేదు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికలో అధికారులు అవినీతికి మేయర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీసీ, జేడ్సీకి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని మేయర్ ఆదేశించారు. అంతకు ముందు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించాలని, అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాంచేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మేయర్ ఆదేశించి, మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునేందుకు మేయర్ అల్లాపూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించగా.., అడుగడుగునా సమస్యలను ఏకరువు పెట్టారు. మొదట సఫ్దార్‌నగర్‌లో పర్యటించిన మేయర్‌ను చుట్టుముట్టిన కాలనీవాసులు, మా ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని మేయర్‌ను నిలదీశారు.
బీర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చొరవతో మంచినీటి పైపులైన్లు వేశారు. ఏడాది గడుస్తున్నా బూస్టర్లు బిగించకపోవడంతో తాగునీరు సరఫరా కావడం లేదని, దీంతో నిత్యం రూ. వందలు వెచ్చించి వాటర్ క్యాన్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాని, అందుకు తగిన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని మేయర్ హామీ ఇచ్చారు.
మేయర్ విజయలక్ష్మిని బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు ఘెరావ్ చేశారు. బాలానగర్ డివిజన్లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం స్టాండింగ్ కమిటీ సభ్యు లు, స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటనకు వచ్చారు. నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి బండి రమేశ్‌కు సమాచారం లేకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్ పిలువగానే బాలానగర్‌లో పర్యటనకు ఎందుకు వచ్చారు? అని నగర మేయర్‌ను స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు.