సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో అత్యంత కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశాల నిర్వహణలో జీహెచ్ఎంసీ పాలక మండలి మరోసారి తన వైఫల్యాన్ని చాటుకుంది. అట్టహాసంగా ముహూర్తం ఖరారు చేయడం, తీరా సమయం ఆసన్నమయ్యాక అర్థాంతరంగా వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ప్రజా సమస్యల పరిషారం కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశం చివరి నిమిషాల్లో వాయిదా వేయడం పట్ల సభ్యుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కమిషనర్ అందుబాటులో లేరనే సాకుతో..
గ్రేటర్ ప్రజలకు అందాల్సిన అత్యవసర సేవలు, అభివృద్ధి పనులపై చర్చించాల్సిన ఈ సమావేశానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్వయంగా ముహూర్తం ఖరారు చేశారు. అజెండాలను సభ్యులందరికీ సర్యులేట్ చేయడమే కాకుండా, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. దీంతో పాలకమండలి సభ్యులు, జోనల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు తమ పనులన్నీ పకనబెట్టి సకాలంలో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అందరూ సిద్ధమయ్యాక కమిషనర్ అందుబాటులో లేరనే సాకుతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంతో సభ్యులు విస్మయానికి గురయ్యారు.
ఎంఐఎం సభ్యుల అసహనం
పాలక మండలి గడువు ముగుస్తున్న తరుణంలో కూడా ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శించడంపై ఎంఐఎం సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అసలు వాయిదాకు గల కారణం ఏమిటి? సభ్యుల, అధికారుల సమయానికి విలువ లేదా?’ అంటూ మేయర్‌ను నిలదీసినట్లు సమాచారం. కమిషనర్ కర్ణన్ మరో రివ్యూ మీటింగ్‌లో ఉండటం వల్లే రాలేకపోయారని మేయర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు శాంతించలేదు. చివరికి కమిషనర్‌తో స్వయంగా మాట్లాడించినా, ప్రజా సమస్యల పట్ల కమిటీకి చిత్తశుద్ధి లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
బడ్జెట్‌పై నీలినీడలు..
వచ్చే నెల 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది. అంతలోపే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది. వచ్చే నెలలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల సమావేశాలు నిర్వహించడం కష్టతరమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోపు స్టాండింగ్ కమిటీతో పాటు బడ్జెట్ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో సమయం తకువగా ఉన్నా, సమన్వయ లోపంతో కీలక నిర్ణయాలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా వాయిదా వేసిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ నెల 29న నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ఈ నెల 31న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించి.. బడ్జెట్‌ను ఆమోదించనున్నట్లు తెలుస్తున్నది. స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా ఎజెండాలో 21 అంశాలు ఉంటే ..చివరి నిమిషాల్లో అదికారులు దాదాపు 14 అంశాలను టేబుల్ అంశంగా చేర్చడం పట్ల మేయర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. టేబుల్ అంశాలను తిరస్కరించిన మేయర్ వచ్చే సమావేశంలో పొందుపర్చాలని చెప్పడం విశేషం.