కేపీహెచ్‌బీ కాలనీ : కూకట్పల్లి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి.. జిల్లా మంత్రి సమయం ఇవ్వడం లేదంటూ.. తహసీల్దార్ కాలయపన చేయడం తగదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. లబ్ధిదారులకు వెంటనే చెక్కులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో మాట్లాడుతూ…కూకట్పల్లి నియోజకవర్గంలో 534 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరవ్వగా, నెల రోజులుగా వాటిని పంపిణీ చేయడం లేదని, లబ్ధిదారులు ఇంటికి వచ్చి ఆ చెక్కులను ఇప్పించాలని కోరుతున్నారని, తహసీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించినా మంత్రి సమయం ఇవ్వడం లేదని, కాలయాపన చేస్తున్నారన్నారు. పేద ప్రజలు అప్పులు చేసి ఆడబిడ్డల పెండ్లి చేస్తారని, వారికి సకాలంలో ప్రభుత్వ సాయం అందిస్తే బాగుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుల, మత, ప్రాంతీయ బేధం లేకుండా అందరికీ లక్ష రూపాయల సాయం చేశామని, కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు భోజనం పెట్టి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు.
చెక్కుల పంపిణీలో రాజకీయమా?
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో రాజకీయాలు చేయడం తగదని, మంత్రులే చెక్కులను పంపిణీ చేయాలనుకుంటే తనను పిలవకుండానే చెక్కులను పంపిణీ చేసినా అభ్యంతరం లేదన్నారు. పేదలకు మేలు చేకూర్చడమే ధ్యేయమైనప్పుడు ఎవరు పంపిణీ చేస్తే ఏమిటీ నష్టమని ప్రశ్నించారు. పేదలకు మంజూరైన చెక్కులను మంత్రి పేరుతో నెల రోజులుగా పంపిణీ చేయకుండా కాలయపన చేయడం సమంజసం కాదన్నారు. ఆన్లైన్ స్టేటస్‌లో ఎమ్మెల్యే వద్ద చెక్కులు పెండింగ్‌లో ఉన్నట్లు చూపడంతో అనేక మంది తమ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారని, అయితే అవి తహసీల్దార్ కార్యాలయంలోనే నెలల తరబడి మూలుగుతున్నాయన్నారు. చెక్కుల పంపిణీలో కూడా రాజకీయాలు చూడటం, మంత్రివర్యులు సమయం ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.
24 గంటల డెడ్‌లైన్..
నెల రోజులుగా చెక్కులను పంపిణీ చేయాలని అధికారులను కోరినప్పటికీ పంపిణీ చేయకుండా లబ్ధిదారులను చుట్టూ తిప్పుకోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల వరకు చెక్కుల పంపిణీ చేయకపోతే తాను తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తానని హెచ్చరించారు. నిరుపేదలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి… ఆడబిడ్డ పెండ్లి చేస్తారని, ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల ఆర్థిక సాయం వారి కష్టాలను తీర్చుతుందన్నారు.