సిటీ బ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుపేదల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ ఇండ్లను ఉచితంగా ఇస్తే.. రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పేరిట సింగిల్ బెడ్రూం ఇంటికే రూ.6 లక్షలు వసూలు చేస్తామనటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్లికేషన్‌కు రూ.100, టోకెన్ అమౌంట్ పేరిట రూ.10 వేలు చెల్లించాలని ప్రకటిస్తూ పేదోడు కనీసం దరఖాస్తు కూడా చేసుకోకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ బస్తీలు, మూసీ పరీవాహక ప్రాంతా ల్లో నివసిస్తున్న నిరుపేదలను గుర్తించి వాళ్లున్న ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని ప్రకటనలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వారితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్‌లోని నిరుపేదలు ప్రభుత్వం ప్రీలాంచ్ విధానంలో తీసుకొస్తున్న రూ.6 లక్షల ఇందిరమ్మ ఇండ్లు అసలే వద్దంటున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన ఇందరిమ్మ ఇండ్ల పథకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రూ.6 లక్షలుంటే తామే సొంతంగా ఇల్లు కట్టుకునేవాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రజావాణికి పొటెత్తుతున్న దరఖాస్తులు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను రూ.6 లక్షలకు లాటరీ విధానంలో విక్రయిస్తామని ప్రకటించింది. ఆ ఇండ్ల కోసం అర్హులు మీసేవ కేంద్రంలో టోకెన్ అమౌంట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కానీ నగరంలోని నిరుపేదలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఉచితంగానే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించినా ప్రజావాణికి పోటెత్తుతున్నారు. ప్రభుత్వం ప్రీలాంచ్ విధానం ప్రకటించకముందు హైదరాబాద్ కలెక్టరేట్ ప్రజావాణికి ప్రతి సోమవారం 500 నుంచి 1000 లోపు దరఖాస్తులు వచ్చేవి. కానీ రెండు వారాలుగా రెండు వేలకు పైగా దరఖాస్తులు అందుతున్నాయి. నగరంలో ఇంటి స్థలంలేని వారి నుంచి ఇప్పటి వరకు 35 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
అదే విధంగా ఇంటిస్థలం ఉన్నవారి నుంచి 6 వేల దరఖాస్తులు అందాయి. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు ఉచితంగా ఇస్తారని నగర ప్రజలు భావిస్తున్నారు. తాము రూ.6 లక్షలు చెల్లించలేమని, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారనే ఆశతో వస్తున్నామని చెబుతున్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం డబ్బులు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పేదలను దోచుకుంటోంది..
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలోని నిరుపేదలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే అన్ని రంగాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు పేదలే లక్ష్యంగా కొత్త దోపిడీకి తెరతీస్తున్నారు. కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేదలు రూ.6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇచ్చారు. కేసీఆర్ కట్టించిన ఇండ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనర్హులకు, ఇతర జిల్లాల వాళ్లకు, కాంగ్రెస్ నేతల అనుచరులుకు పంచిపెడుతున్నారు. అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయాలి.- పారునంది శ్రీకాంత్, చందానగర్
సీఎం భూములన్నీ అమ్ముకుంటున్నడు
-మన్నె మోహన్, కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్
రేవంత్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచి సిటీ లోపల, సిటీ బయట ఉన్న ప్రభుత్వ భూములన్నీ అమ్ముకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులను బెదిరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకుంటామంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అయితే ప్రతిదీ రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే చూస్తారు అనడానికి రేవంత్‌రెడ్డి నిదర్శనంగా నిలుస్తున్నారు. పేదలు రూ.6 లక్షలు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కొంచమైన ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఉచితంగా ఇస్తే.. ఈ ప్రభుత్వం సింగిల్ బెడ్రూం ఇండ్లకే రూ.6 లక్షలు ఇవ్వాలనడం దారుణంగా ఉంది.