సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక సమీకృత మార్కెట్ ఉండాలన్న లక్ష్యానికి జీహెచ్ఎంసీ అధికారులు తూట్లు పొడిచారు. కొత్తవి కాదు కదా..పురోగతిలో ఉన్న పనులను సైతం అటకెక్కించారు. చిక్కడపల్లిలో రూ. 40 కోట్లు, అమీర్పేట రూ. 13.20 కోట్లు, పంజాగుట్టలో రూ.6.70 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, పనులను పక్కన పెట్టారు. నారాయణగూడ ఓల్డ్ మున్సిపల్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద రూ. 4 కోట్లతో చివరి దశకు వచ్చిన పనులను సైతం పూర్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా స్థానికులు వారాంతపు సంతలపై ఆధారపడాల్సి వస్తున్నది. కమిషనర్ స్పందించి మోడల్ మార్కెట్లపై సమీక్షించి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కూరగాయలు, మాంసాహారం ఒకే ప్రదేశంలో లభ్యమయ్యే విధంగా పాత మార్కెట్ స్థలాల్లో నూతనంగా మోడల్ మార్కెట్ల నిర్మాణాలను కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఒకే చోట నిత్యావసర వస్తువులు లభించేలా మార్కెట్ ఉండటంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ మోడల్ మార్కెట్ల నిర్మాణం జరిగింది. దాదాపు రూ. 24కోట్ల ఖర్చు పెట్టి 39 మోడల్ మార్కెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో మార్కెట్లో ప్రశాంతమైన వాతావరణం, వేజిటేబుల్, నాన్వెజ్, స్టోర్ వేర్వేరుగా ఉండగా, శాకాహార, మాంసాహార అమ్మకం కేంద్రాలు, తినుబండారాల దుకాణాలు, ఫార్మసీ, ఏటీఎంలు, గ్రాసరీ దుకాణాలు, డ్రై ఫ్రూట్ దుకాణాల ఏర్పాటు జీ+1 నిర్మాణంతో ఏర్పాటైన ఈ మోడల్ మార్కెట్లు స్థానికులకు ఉపయుక్తంగా ఉంటున్నాయి.