ఖైరతాబాద్, ఏప్రిల్ 5: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారని నేషనల్ ప్లాట్‌ఫాం ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్డ్ (ఎన్పీఆర్డీ) జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శారీరక దివ్యాంగులకు ఉద్యోగాల రోస్టర్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలు చేసినా అవకాశం రావడం లేదని, దీంతో అనేక మంది ఆత్మహత్యలకు సిద్దమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటి రోస్టర్‌గా కేటాయించి ఉద్యో గ అవకాశాలు కల్పించాలని కోరారు. తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులు రాష్ట్రంలో 2 వేల మందికిపై ఉన్నారని, వారికి రూ.15వేల పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇస్తామన్నారని, ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. సమావేశంలో ఎస్సీఐఏటీ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి షఫీ అహ్మద్ ఖాన్, టీఎండీఏ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, శోభా రెడ్డి, మల్లికార్జున్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.