Indiramma Indlu | మేడ్చల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): ‘ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్ధిదారులను గుర్తించేది ఎప్పుడు?’ అంటూ దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల కోసం గత డిసెంబర్, 2023 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షా 42 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఐదు నియోజకవర్గాలకు 17,500 ఇండ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. దీంతో దరఖాస్తుదారులలో ఆందోళన ప్రారంభమైంది.
ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ఇండ్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి మాత్రమే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులను గుర్తించి రూ.5 లక్షలను ఇంటి నిర్మాణానికి నాలుగు విడతలుగా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై కదలిక లేకపోవడంతో అసలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మార్చి నెలలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం దరఖాస్తులను పరిశీలించడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు పురపాలక సంఘాలు, గ్రామాల నుంచి లక్షా 42 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఎంపిక ఎలా ఉంటుదున్న ఆందోళన దరఖాస్తుదారులలో మొదలైంది.
నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేస్తే అర్హులందరికి కూడ మొదటి విడతలో మంజూరు చేసే అవకాశం కనిపిండచం లేదు. ఇండ్ల ఎంపికలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో? స్పష్టత రావడం లేదు. ఇప్పటికే దరఖాస్తుదారులు స్థానిక నాయకుల చుట్టూ తిరిగుతూ తమకు ఇండ్లు మంజూరు చేసే విధంగా చూడాలని కోరుతున్నారు. అయితే, లబ్ధిదారుల ఎంపిక విషయమై ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. మార్గదర్శకాలను ఎప్పుడు ప్రకటించి, దరఖాస్తుల పరిశీలన ఎప్పుడు ప్రారంభిస్తారో! అన్న విషయమై ఆశగా దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.