సిటీబ్యూరో/సైదాబాద్/వనస్థలిపురం: చంచల్‌గూడ పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను స్థానిక మహిళలు నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడకుండా వెళ్లడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికంగా తమకు ఇండ్లు కేటాయించాలని చెప్పేందుకు వస్తే మంత్రి మాట్లాడకుండా వెళ్లిపోయారని, తాము కిరాయి ఇండ్లల్లో ఉండలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు స్థానికంగా ఖాళీగా ఉన్న డబుల్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. తాము కూడా లబ్ధిదారులమని, ఇంతవరకు ఇండ్లను కేటాయించలేదని, కనీసం తమ బాధలు కూడా మంత్రి వినలేదని ఆరోపించారు.
డబుల్ ఇండ్ల పరిశీలన
మహిళలంతా ఒక్కసారిగా నిలదీయడంతో మంత్రి పొన్నం అక్కడి నుంచి చంచల్గూడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని పరిశీలించేందుకు వెళ్లిపోయారు. అంతకుముందు మంత్రి పొన్నం చంచల్ గూడ వద్ద 284 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ఖాళీగా ఉన్న గృహాలను మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలలా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు.
మూసీ నది అభివృద్ధి పనులతో గృహాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఖాళీగా ఉన్న డబుల్ గృహాలను మూసీ బాధితులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంత్రి వెంట రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఎల్బీనగర్ జడ్సీ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు ఉన్నారు.