Hotels Inspections | కొండాపూర్, జూన్ 29 : సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రతపై అధికారులు దృష్టి సారించినట్లు కనిపిస్తున్నా, తనిఖీల తర్వాత తీసుకుంటున్న చర్యలపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతిరోజూ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ఔట్లెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజూ తనిఖీలు.. చర్యలెక్కడా..?
సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, చందా నగర్ ప్రాంతాల్లో ప్రముఖ పేరుగాంచిన హోటళ్లు సైతం నామ మాత్రపు పరిశుభ్రతనే పాటించడం విడ్డూరం. అధికారుల తనిఖీల్లో అపరిశుభ్రమైన వంటగదులు, కుళ్లిన మాంసం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, లేబుళ్లు లేని ఫుడ్ ఐటమ్స్, నాసిరకం నిల్వ విధానాలు, చెత్త మధ్యలో ఆహార తయారీ వంటి అనేక ఉల్లంఘనలు బయటపడుతున్నాయి. అధికారులే ఈ వివరాలను ఫొటోలు, వీడియోలతో సహా బహిరంగంగా విడుదల చేశారు.
ఇన్ని లోపాలు బయటపడుతున్నప్పటికీ సంబంధిత హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వడం, హెచ్చరికలు జారీ చేయడం మినహా భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు లేదా తాత్కాలికంగా హోటల్ మూసివేత వంటి చర్యలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయని. దీంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటల్ యాజమాన్యాలకు భయం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్కోరింగ్ అర్థం చేసుకునేదెలా…?
మరోవైపు అధికారులు ఇటీవల హోటళ్లకు ప్రత్యేక స్కోరింగ్ విధానం తీసుకొచ్చారు. తనిఖీల అనంతరం హోటళ్లకు స్కోర్ కేటాయిస్తున్నప్పటికీ, ఆ స్కోర్‌కు అర్థమేంటి, ఎంత స్కోర్ వస్తే హోటల్ పరిశుభ్రంగా ఉన్నట్లు భావించాలి, తక్కువ స్కోర్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాలపై స్పష్టత లేక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఆహార భద్రత విషయంలో ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, తనిఖీలతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్కోరింగ్ విధానంపై కూడా స్పష్టమైన అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.