కవాడిగూడ, మే 26 : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు హాజరై మద్దతు పలికారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశానికి తలమానికంగా నిలిచిందన్నారు. దేశంలో పేదరికం పోవాలంటే యువత బాగుపడాలని, దేశంలోని అన్ని రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్టీఐ పట్ల అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ సూచించారు. ఈ దీక్షలో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యతిరాజులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ కుమారి కన్నెబోయిన ఉషారాణి, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌పీఎస్ జాతీయ కో -ఆర్డినేటర్ గాదం ఉత్తరయ్య, జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా, సాయంత్రం కేశవులుకు మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.