సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): నగరవాసులకు ఓ వైపు విశ్వనగర స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూనే మరో వైపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేండ్లుగా చేస్తున్న అభివృద్ధి యజ్ఞం కొనసాగుతునే ఉన్నది. సంక్షేమ పథంలో భాగంగా నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్లు, ఐటీ రంగంలో మరింత అభివృద్ధి సాధించే కొత్త కంపెనీలు, ఆహ్లాదకరమైన జీవన శైలి కోసం ఔటర్‌పై సైకిల్ ట్రాక్, నగరానికి తలమానికంగా మార్చేలా మూసీ సుందరీకరణ…ఇలా బహుముఖ ప్రణాళికలకు శ్రీకారం చుడుతూ అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకుపోతున్నది. నగరాన్ని బెస్ట్ లివింగ్ సిటీగా మార్చే క్రమంలో భాగంగా..గత నెల రోజుల్లోనే వేల కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు పునాది రాయి పడింది. మరికొన్ని ప్రారంభం కూడా జరిగాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, సబిత, మహమూద్ అలీ, మల్లారెడ్డి సహా నగర ఎమ్మెల్యేలు విరామం లేకుండా చేస్తున్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో గ్రేటర్ హైదరాబాద్‌లో జాతర వాతావరణం నెలకొన్నది. అనతి కాలంలోనే కండ్ల ముందు నగర రూపు రేఖలు ఊహించనిరీతిలో మారుతుండటంతో నగరంలో ఏ మూలకు వెళ్లినా ప్రజల్లో అభివృద్ధిపైనే విస్తృతంగా చర్చ కొనసాగుతున్నది.
సామాన్యుడికి ఇబ్బంది లేకుండా మౌలిక వసతుల కల్పన…నిరుపేదలు ఆత్మగౌరవంగా బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ… నగరవాసి ఆయుష్షు పెంచే ఆహ్లాదకరమైన పార్కులు… సర్కారు దవాఖానల్లోనే పేదవారికి ఉచితంగా ఖరీదైన కార్పొరేట్ వైద్యం… ఎన్నో ఆశలతో చదువు పూర్తి చేసుకున్న యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు… హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే అంతర్జాతీయ ప్రాజెక్టులు… ఇలా ఒకటేమిటి! అన్ని రంగాల్లో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా హైదరాబాద్ మహా నగరంలో అభివృద్ధి జాతర కొనసాగుతున్నది. ఇందులో భాగంగా గత నెల రోజుల్లోనే వేలాది కోట్ల అభివృద్ధి పనులు అందుబాటులోకి రాగా… భవిష్యత్ కోసం మరిన్ని వేల కోట్ల అభివృద్ధి పనులకు పునాది రాయి పడింది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా గ్రేటర్ మంత్రులు విరామం లేకుండా చేస్తున్న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉత్సవ వాతావరణం నెలకొన్నది. అనతి కాలంలోనే కండ్ల ముందు నగర రూపు రేఖలు ఊహించని రీతిలో మారుతుండటంతో నగరంలో ఏ మూలకు వెళ్లినా ప్రజల్లో అభివృద్ధిపైనే విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
మూసీ.. మురిసేలా..
ఇప్పుడు అనేక సినిమాలు మొదలు నగరంలో రూపుదిద్దుకునే ప్రతి వెబ్ సిరీస్‌లోనూ కనిపించే దృశ్యం… దుర్గం చెరువు తీగల వంతెన. మరి ఒక్క వంతనతోనే అటు పర్యాటకం, ఇటు సౌకర్యం ఈ స్థాయిలో ఉంది. త్వరలోనే తలదన్నేరీతిలో మూసీపై ఏకంగా పద్నాలుగు వంతెనలు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అద్భుతమైన డిజైన్లతో మూసీ, ఈసీలపై 14 వంతెనల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించగా… ఇందులో ఏడు వంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.545 కోట్లతో మంచిరేవుల, బుద్వేల్ ఐటీ పార్కు వద్ద రెండు, ఉప్పల్ భగాయత్, ప్రతాప సింగారం, మూసారాంబాగ్, ఫతుల్లాగూడ… ఇలా ఏడు చోట్ల వంతెనల నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది.
కలలోనూ ఊహించని ఐటీ అడుగులు..
దేశంలో ఐటీ అంటేనే బెంగళూరు నగరం. కానీ ఈ తొమ్మిదిన్నరేండ్లలో ఆ నగరాన్ని వెనక్కి నెట్టి ఐటీలో మేటిగా నిలిచింది హైదరాబాద్. అదేవిధంగా హైదరాబాద్‌లో ఐటీ అంటే వెస్ట్ సిటీ. తెలంగాణ సర్కారు ఆ గమనాన్నీ మార్చి… ఐటీ వెలుగులు నలుదిశలా వ్యాపించేలా చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా తూర్పు నగరంలోనూ ఐటీ టవర్లు వస్తున్నాయి. అయితే పాత నగరంలో ఐటీ పార్కు అనేది ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఏకంగా రూ.700 కోట్లతో 21 అంతస్తుల ఐటీ టవర్ నిర్మాణానికి మలక్‌పేటలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడమనేది హైదరాబాద్ చరిత్రలోనే ఓ కీలక పరిణామం. రానున్న రోజుల్లో పాత నగరంలోనూ టెకీల సందడి కనిపించనున్నది. అంతేకాదు… హైటెక్ సిటీలో మాదిరిగా మెట్రో స్టేషన్ నుంచి ఈ ఐటీ టవర్‌కు స్కైవాక్ కూడా నిర్మాణం కానున్నది.
దేశంలోనే తొలిసారిగా సైకిల్ ట్రాక్..
ప్రపంచంలో రెండోదిగా… దేశంలోనే తొలిసారిగా ఓఆర్ఆర్ సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగ్-కొల్లూరు వరకు సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో 23 కిలోమీటర్ల ట్రాక్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ట్రాక్ సైకిలిస్టులకు గొప్పవరంగా మారింది. ముఖ్యంగా ట్రాక్ అందుబాటులోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ఏకంగా పది వేల మంది సైకిలిస్టులు ట్రాక్‌ను వినియోగించడం విశేషం.
– సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు (ఫైల్)
క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సేవలు..
తెలంగాణ వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు రాగా.. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సలో రోబోటివ్ సేవలు వచ్చాయి. ఇప్పటికే నిమ్స్‌లో రూ.32 కోట్లతో రోబోటివ్ సేవలు కొనసాగుతుండగా… ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలోనూ రూ.32 కోట్లతో రోబోటిక్ సేవల్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఆదివారం సంతాన సాఫల్య కేంద్రం గాంధీ ఆస్పత్రిలో అందుబాటులోకి రానున్నది. ఈ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు.
– ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో రోబోటిక్ థియేటర్నుప్రారంభిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ(ఫైల్)
పేదోళ్ల ప్యాలెస్‌లు..
నగరంలో చిన్నపాటి పుట్టిన రోజు వేడుకలు చేయాలన్నా ఇంట్లో చేయడం సాధ్యం కాదు. చిన్నపాటి ఫంక్షన్ హాల్‌కు వెళ్లినా వేలాది రూపాయల అద్దె. ఇలాంటి తరుణంలో నిరుపేద సైతం శుభకార్యాలను జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గత నెల రోజుల వ్యవధిలోనే పలు చోట్ల ఇవి అందుబాటులోకి వచ్చాయి. బేగంపేటలో రూ.7 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, వెంగళరావునగర్‌లో రూ.2.60 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ పేదలకు అందుబాటులోకి వచ్చాయి.
అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం..
నగర శివారు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. గత నెల రోజుల్లోనే వేలాది కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. చందనవెల్లిలో సింటెక్స్ రూ.350 కోట్లు, కిటెక్స్ రూ.1200 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా… మంత్రి కేటీఆర్ ఆ కంపెనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా జీనోమ్ వ్యాలీలో రూ.200 కోట్ల బీఎస్ఈ, రూ.వెయ్యి కోట్లతో యూరోఫైన్స్ ముందుకు రాగా… వాటికి కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

2bhk1
రికార్డు స్థాయిలో డబుల్ బెడ్రూం ఇండ్లు..
తెలంగాణ ప్రభుత్వం కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా లక్ష ఇండ్ల పంపిణీకి నడుం బిగించడమనేది దేశ చరిత్రలో రికార్డు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా కేంద్ర సహకారంతో అక్కడ నిర్మించే ఆ ఇంటి విలువ రూ.2-3 లక్షలకు మించదు. కానీ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణ వ్యయం సుమారు రూ.9 లక్షలైతే.. బహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ. 50 లక్షలు. ఇంత ఖరీదైన ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. కేవలం నాలుగు విడతల్లోనే ఏకంగా 61,596 మంది నిరుపేదలకు సొంతంటి కలను సాకారం చేయడం విశేషం. మున్ముందు మరిన్ని విడతల్లో లక్ష ఇండ్ల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
చెరువుల చెంత ఆహ్లాదం..
హుస్సేన్‌సాగర్ తీరంలో రూ.26.65 కోట్లతో నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్క్ అందుబాటులోకి రాగా… కూకట్పల్లి నియోజకవర్గంలోనూ రూ.19.30 కోట్లతో రంగదాముని చెరువు సుందరీకరణను పూర్తి చేసుకుంది. అదేవిధంగా దుర్గం చెరువు వద్ద రూ.9 కోట్లతో మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్ కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.
వంద శాతం మురుగు శుద్ధి దిశగా..
నగరంలో రోజుకు 1950 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుండగా… ప్రస్తుతం 40 శాతం శుద్ధి సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలో వంద శాతం మురుగు శుద్ధి చేసేందుకు రూ. 3,866.41 కోట్ల అంచనా వ్యయంతో 31 ఎస్టీపీలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువు ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చాయి.
దళిత కుటుంబాల్లో వెలుగులు..
రూ.16.20 కోట్ల వ్యయంతో ఇటీవలే 162 కుటుంబాలకు దళిత బంధు ద్వారా మురుగు వ్యర్థాల తరలింపు వాహనాల పంపిణీ పూర్తయింది. మురుగు వ్యర్థాల తరలింపు వాహనంతో ఒక్కో కుటుంబం నెలకు రూ.1.20 లక్షలు సంపాదించడంతో సహా 486 మందికి ఉపాధి లభిస్తుండటం విశేషం.
పర్యావరణహితంగా..
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను పర్యావరణహితంగా మార్చేందుకు అడుగులు మొదలయ్యాయి. ఏకంగా వెయ్యి గ్రీన్ బస్సుల లక్ష్యంగా తొలి విడతగా 25 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. జీరో పొల్యూషన్ ప్రాతిపదికన ఈ బస్సులు సేవలు అందించనున్నాయి.