మేడ్చల్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అంతటా సంక్షేమ పథకాల పండుగ కొనసాగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీసీ కులవృత్తులు, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం, గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షల ప్రొసిడింగ్ పత్రాలు(ఉత్తర్వులు), దళితబంధు పథకానికి లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుండటంతో సందడి నెలకొన్నది. సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో ఏ ప్రభుత్వానికి సాధ్యంకాని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందటంతో.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకంతో లబ్ధిపొందాం.. గులాబీ జెండా ఎత్తుతాం.. బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు తెలుపుతాం.. అంటూ ప్రకటిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో…
జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాలలో ఇప్పటి వరకు బీసీ కులవృత్తులకు రూ.16 కోట్లు, మైనార్టీలకు రూ.5 కోట్ల 14 లక్షలు, గృహలక్ష్మి పథకం కింద రూ.60 కోట్లు వెచ్చించారు. దీంతో 4,114మంది లబ్ధి పొందారు. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని., విడుతల వారీగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
రెండవ విడత దళితబంధుకు 5500మంది
రెండవ విడత దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా 5,500 మంది లబ్ధిదారులకు దళితబంధును వర్తింపజేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల పక్రియ పూర్తికాగా లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులు ఉన్నారు. మొదటి విడతలో 500 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేసిన విషయం విధితమే.
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్
అర్హూలైన వారందరికీ పథకాల వర్తింపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నిండుతున్నది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఏర్పడింది. ఇచ్చిన హామీలే కాకుండా అనేక పథకాలు అమలు చేయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్న సందర్భంగా అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. అభ్యర్థుల ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది.