హైదరాబాద్ : ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒకరికీ లబ్ది చేకూరుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar ) అన్నారు. బుధవారం బంజారాహిల్స్ వార్డ్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో కలిసి పొన్నం ప్రారంభించారు.
అభయ హస్తంలో భాగంగా వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా అధికారులను అడగాలని సూచించారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రజల వద్దకు పాలన పేరుతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు. ఆరు గ్యారెంటీలతో(Six Gurantees) పాటు మిగతా సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో 150వార్డులకు గాను వార్డుకు నాలుగు లొకేషన్లలో మొత్తం 600 కేంద్రాల్లో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ పూర్తి సహకారం ఉంటుందని, పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, కాలుష్య నివారణ నియంత్రణ బోర్డు మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు.