అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న హింసాత్మక వాతావరణం ,నిరంకుశ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు( YCP Leaders ) ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్( NHRC ) కు బుధవారం ఫిర్యాదు చేశారు. . ఈమేరకు ఛైర్మన్ జస్టిస్ సుబ్రహ్మణ్యం ( Justice Subramanyam) ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై ఇటీవల జరిగిన దాడులు , వైఎస్ఆర్సీపీ కార్యకర్త సల్మాన్ రాజు దారుణ హత్యను చైర్మన్కు వివరించారు. టీడీపీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వీడియోలు, ఫోటోల రూపంలో సాక్ష్యాలను సమర్పించారు.
సల్మాన్ రాజు హత్య వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, ప్రజాస్వామ్యానికే తీవ్ర ముప్పు వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బృందంలో ఎంపీలు వై.వి. సుబ్బారెడ్డి, పి.వి. మిథున్ రెడ్డి, పలువురు ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు మరియు ఎస్సీ సెల్ నాయకులు ఉన్నారు.