ధర్మారం, ఫిబ్రవరి 4: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న కే రవిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ద్వారా కార్యదర్శి సస్పెన్షన్ ఉత్తర్వులు అందాయి. ధర్మారంలో ప్రజల నుంచి ఇంటి పన్నులు రూ.63,332 సొమ్మును వసూలు చేసి కార్యదర్శి రవి సబ్ ట్రెజరీలో జమ చేయలేదు. దీనిపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీవో వేముల సుమలత విచారణ చేపట్టారు.
వసూలైన డబ్బులను కార్యదర్శి సొంతానికి వాడుకొని సబ్ ట్రెజరీలో జమ చేయలేదని తేలడంతో నివేదికను అధికారులకు పంపించారు. దీంతో ఎంపీడీవో పంపిన విచారణ నివేదికను అనుసరించి కార్యదర్శి రవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.