సిటీబ్యూరో, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): తొలిదశలో ఆరు చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా అవసరమైన చర్యలను ప్రారంభించింది. ఇప్పటివరకు చెరువుల్లో ఉన్న ఆక్రమణల తొలగింపుకే పరిమితమైన హైడ్రాకు పరిరక్షణ బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన నిధులను హెచ్ఎండిఏ నుంచి సమకూర్చుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలుత పది చెరువులు అనుకున్నప్పటికీ.. ఇప్పటివరకు ఆరు చెరువులకు సంబంధించిన పునర్నిర్మాణం, అభివృద్దికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)లను బెంగళూరు సంస్థ ద్వారా సిద్దం చేయించింది.
త్వరలో చెరువుల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్లను పిలుస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పుల్ ట్యాంక్ లెవల్స్ నిర్ధారించి ఆక్రమణలు తొలగింపు పూర్తయిన వాటినే తొలిదశలో ఎంపిక చేసుకున్నారు. ఈమేరకు కూకట్పల్లి నల్లచెరువు, అల్లాపూర్ సున్నంచెరువు, ఉప్పల్‌భగాయత్ నల్లచెరువు, బాగ్అంబర్పేట్ బతుకమ్మకుంట,మాదాపూర్ తమ్మిడికుంటలను ఎంచుకున్నారు. గత మూడురోజులుగా ఈ ఐదు చెరువుల వద్ద పూడికతీత, చెరువుల వద్ద ఉన్న వ్యర్థాలు తొలగించడం, చుట్టూ ఉన్న చెత్తా చెదారం తీసేయడం వంటి పనులు చేస్తున్నారు. మంగళవారం బతుకమ్మ కుంటవద్ద పూడికతీత పనుల్లో నీరు బయటకు వచ్చింది.
మూడు అంశాలపై దృష్టి
తొలిదశలోఎంపిక చేసుకున్న చెరువులన్నీ కాలుష్యం కోరల్లోనే ఉండడంతో ఆయా చెరువుల్లో ఉన్న నీటిని పూర్తిగా బయటకు తీసి ఆపై నేలనంతా శుద్ధి చేయిస్తారు. చెరువులోకి మురుగునీరు రాకుండా సీవరేజ్ పైప్‌లేన్ ఏర్పాటుచేస్తారు. మరోవైపు చెరువులోకి వర్షపునీరు వచ్చి చేరేలా చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఒకవైపు కాలుష్య రహితంగా, మరోవైపు వర్షపు నీరు వచ్చి చేరడం, చుట్టుపక్కల ఆహ్లాదకరమైన పరిసరాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రస్తుతం ఈ చెరువుల పునరుజ్జీవనంలో తీసుకుంటున్నారు. బతుకమ్మ చెరువు వద్ద పూడికతీత పనులు ప్రారంభం కాగా మిగతా చెరువుల్లో నీరు తొలగిస్తున్నారు. ఈ చెరువుల పునరుజ్జీవనం ప్రక్రియ జూన్‌కల్లా పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.