సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర ప్రగతికి, ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో కీలకమైన మెటో రైలు ప్రాజెక్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది. నగర మౌలిక వసతుల కల్పన, ప్రజా రవాణా వ్యవస్థల విస్తరణ వంటి విషయాల్లో రాజకీయ పట్టింపులకు పోకుండా, అన్ని పార్టీలు ఏకతాటికపైకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని ఓవైపు చెబుతూనే… మరోవైపు నగరానికి గుండెకాయ వంటి మెట్రో ప్రాజెక్టుపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. పార్టీల మధ్య వైషమ్యాల వల్ల ప్రాజెక్టులు ఆలస్యమైతే ట్రాఫిక్ నరకంలో నగరవాసులు నలిగిపోవాల్సి వస్తుందని సమితి పేర్కొంది.
ముఖ్యంగా మెట్రో రెండో దశ విస్తరణ ఆలస్యం కావడంతో నార్త్ సిటీ పరిధిలోని లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు ప్రతిరోజు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి రుణాల మంజూరు, ఎల్ అండ్ టీ టేకోవర్ సందిగ్ధత వంటి అంశాలు ప్రాజెక్టును మరింత వెనక్కి నెడుతున్నాయన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆపీ, మెట్రో ఫేజ్-2 పనులు మొదలయ్యేలా సంయుక్తంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆర్థిక అవగాహనకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు, నగర మౌలిక వసతుల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, నేతలంతా కలిసి ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి విజ్ఞప్తి చేసింది.