కవాడిగూడ, డిసెంబర్ 17: అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా జరిగిన చెరువు విస్తరణ కారణంగా భూములు కోల్పోయామని.. తమకు న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్దచెరువు బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈమేరకు బుధవారం వారు ఇందిరాపార్కు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. అధికారుల బాధ్యతారాహిత్యంతో 93 ఎకరాల అమీన్పూర్ పెద్దచెరువు ప్రస్తుతం 450 ఎకరాలకు విస్తరించిందని ఆరోపించారు.
అమీన్పూర్ పెద్దచెరువు పరిసరాలలో ఉన్న పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజీ మురుగు వచ్చి చెరువులో కలుస్తుండటంతో క్రమేనా చెరువు విస్తరించి తమ స్థలాలు కనిపించకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో స్థలాలను కొనుగోలు చేసిన దాదాపు 3వేల మంది రోడ్డున పడ్డారన్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ పోరాటం సాగిస్తామని వారు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అమీన్పూర్ పెద్దచెరువు బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు స్వర్ణశ్రీ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.