‘కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్లు పెట్టుడు.. గరిబోళ్ల ఇండ్లు కొట్టుడు.. ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు..ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నదమ్ములు మాత్రం హైదరాబాద్‌లోని భూములను దోచుకుంటున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పీర్జాదిగూడలో బుధవారం వివిధ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని, దీంతో నగరం చుట్టూ పక్కల రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. ‘హైదరాబాద్‌లో సంతోషంగా ఎవరైనా ఉన్నారంటే.. ఇద్దరే ఇద్దరు.. ఒకరు కాంగ్రెస్ దొంగలు..మరొకరు దోమలు’ అంటూ.. ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అండదండలతో కబ్జాల పర్వం కొనసాగుతున్నదన్నారు. ‘గల్లీ గల్లీలో దోమల దండయాత్ర సాగుతున్నదని, నగర పేర్లను దోమలహీల్స్, దోమలాబాద్, దోమలగుట్టలుగా మార్చాలని.. దోమల మందును కొట్టించలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం అభివృద్ధి చేస్తారు’ అని ప్రశ్నించారు.
– మేడ్చల్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ)/పీర్జాదిగూడ

అతీగతి లేని గ్యారెంటీలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి..అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకు వంచిస్తున్నదని విమర్శించారు. అందించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చామని కేటీఆర్ అన్నారు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చామని, ఇండ్లు లేని నిరుపేదల కోసం లక్ష డబుల్ బెడ్రూంలను నిర్మించినట్లు చెప్పారు.
ఏండ్లు గడిచినా ఉప్పల్ ఫ్లై ఓవర్ పూర్తి కాలే
ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. 8 ఏండ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లు ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 42 ఫ్లైఓవర్లు నిర్మించామని, ఉప్పల్ ఫ్లైఓవర్‌ను తాము నిర్మిస్తామంటే కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ప్రజలు నరకం చూస్తున్నారని పేర్కొన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బుల్డోజర్లు వస్తాయని కేటీఆర్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ప్రభుత్వంతో పోరాడి బుల్డోజర్ల విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిన నేపథ్యంలో కేటీఆర్ మాజీ మంత్రి మల్లారెడ్డి, నాయకులను అభినందించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే సత్తా చాటితే కార్పొరేషన్లలో గూలాబీ జెండా
ఎగురవేయడం ఖాయమన్నారు.
అభివృద్ధిని గాలికొదిలేసిన కాంగ్రెస్
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నగరాభివృద్ధిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.
కేటీఆర్‌ను కలిసేందుకు ఉత్సాహం..
పీర్జాదిగూడకు వచ్చిన కేటీఆర్‌ను కలిసేందుకు కార్యకర్తలు, నాయకులు ఉత్సాహం చూపించారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా పీర్జాదిగూడ మాజీ మేయర్ వెంకట్‌రెడ్డి బోనాలు, డప్పు వాయిద్యాలతో కేటీఆర్‌ను ఆహ్వానించారు. జై కేటీఆర్ జైజై కేటీఆర్ అంటూ..నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మేయర్ వెంకట్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లేశ్, హరిశంకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరెంట్ కట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తుండగా, మధ్యలో రెండు మూడు సార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నాయకులు పార్టీ శ్రేణులు సెల్ఫోన్లు ఆన్ చేశారు. ఆ తర్వాత కరెంట్ రావడంతో కాంగ్రెస్ పాలనలో ఇట్లనే ఉంటుందని, కరెంటు వస్తది పోతది అని ఎద్దేవా చేశారు.