బంజారాహిల్స్, జూన్ 19: వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేధిస్తున్నాం.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్ఎంసీ సర్కిల్-18లోని పలు ప్రాంతాల్లో జలమండలితో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు జూన్ నెలలో సైతం రోడ్లను యథేచ్ఛగా తవ్వుతూ పనులు చేస్తున్నాయి. దీంతో ప్రధాన రోడ్లతో పాటు కాలనీ రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తవ్విన రోడ్లను రిస్టోరేషన్ చేసినా వ్యర్థాలను తొలగించడంలో విపరీతమైన జాప్యం చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మే 25 తర్వాత కూడా రోడ్ల తవ్వకాలు కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులను బల్దియా అధికారులు ఆపేసినా రోడ్ల రిస్టోరేషన్ను వేగవంతం చేయకపోవడంతో వర్షపునీటితో ప్రమాదం పొంచి ఉంది.
రిస్టొరేషన్ పనులు చేయకపోవడంతో..
బంజారాహిల్స్ రోడ్ నం 14లో శబ్దాలయ వెనకాలనుంచి జూడియో స్టోర్ దాకా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వరదనీటి లైన్ పనులు చేపట్టారు. నిర్దేశిత గడువులో రోడ్డు రిస్టొరేషన్ పనులు చేయకపోవడంతో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బంజారాహిల్స్ రోడ్ నం. 13నుంచి బంజారాహిల్స్ రోడ్ నం.1లో కొత్తగా నిర్మిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రికి సంబంధించిన అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్ కోసం జీహెచ్ఎంసీ నుంచి రోడ్డు కటింగ్ అనుమతి తీసుకుని పనులు పూర్తిచేశారు. అయితే పదిహేనురోజుల క్రితమే రిస్టోరేషన్ పనులు పూర్తయినా డెబ్రీస్ తొలగించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ట్రాఫిక్‌జామ్‌తో ఇక్కట్లు..
బంజారాహిల్స్ రోడ్ నం.14 నుంచి శబ్దాలయ స్టూడియోస్, కేబీఆర్ పార్కు చౌరస్తా మీదుగా జలమండలి ఆధ్వర్యంలో మంచినీటి లైన్ కోసం జూన్ 10 నుంచి రోడ్డును తవ్వేసి పనులు చేశారు. వారం రోజులు గడిచినా రోడ్డు రిస్టోరేషన్ పనులు పూర్తిచేయకపోవడంతో అత్యంత రద్దీ చౌరస్తాలో సమస్యలు తలెత్తాయి. బంజారాహిల్స్ రోడ్ నం 14లోని రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ నుంచి జూడియో స్టోర్ దాకా మంచినీటి లైన్ కోసం ప్రత్యేకంగా లైన్ పనులు చేపట్టారు. అయితే వర్షాకాలంలో రోడ్డు కటింగ్ నిషేధించిన తర్వాత పనులు ప్రారంభించడంతో 10 రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు పనులు నిలిపివేయడంతో రోడ్డు మొత్తం గతుకులమయంగా మారింది. ఆగస్టు దాకా రోడ్డును తవ్వే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది.