తెలుగు యూనివర్సిటీ, మే 5: నిలోఫర్ దవాఖానలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పరిపాలనా, జలమండలి అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా మూడు రోజులుగా పలు విభాగాల్లో నీరు లేక రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. దవాఖానలో బోర్లు అడుగంటి పోవడంతో జలమండలి నీటిపైనే ఆధారపడవలసిన పరిస్థితి నెలకొన్నది. మూడు భవనాల్లో విస్తరించి ఉన్న దవాఖానకు నీటి కనెక్షన్లు ఉన్నా అవసరానికి సరిపడా నీటి విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దవాఖాన వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అవసరానికి మించి నీటిని అందిస్తున్నామని అధికారులు తెలుపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నీటి కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవనం, ఏఆర్టీ భవనాల్లో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది. ల్యాబ్ కేంద్రాలు కొనసాగుతున్న తరుణంలో నల్లాల ద్వారా నీటి సరఫరా లేక భవనంలోని పలు విభాగాల్లో పని కుంటుపడిందని ఉద్యోగులు వాపోతున్నారు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి, నిలోఫర్ అధికారుల సమన్వయ లోపించిందని తెలుపుతున్నారు. క్యాంటిన్లో బోరు నీటిని వాడుతుండడం గమనార్హం.