శేరిలింగంపల్లి / ఉస్మానియా యూనివర్సిటీ, మే14: నగరంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు వాటర్ ట్యాంకర్లు వరస కడుతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఇండ్లలో ఉండే బోర్ల నుంచి సరిగ్గా నీళ్లు రాకపోవడంతో హైదరాబాద్లో సామాన్య ప్రజలు నీటి కష్టాలు తిరిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో ఇటీవల ఎన్నికల విధుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన పోలీస్ సిబ్బంది, ఎన్నికల అధికారులు సైతం సమస్యలు ఎదుర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాల్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వాహణకు వచ్చిన సిబ్బందికి నీటి కష్టాలు తప్పలేదు. వీటితో పాటు పోలీస్స్టేషన్లలోనూ నీటి కష్టాలు అక్కడక్కడ ఎదురవుతున్నాయి. ట్యాంకర్లతో పోలీస్స్టేషన్లకు నీటిని తెప్పిస్తున్నారు. కొన్నిసార్లు బుకింగ్ చేసిన రెండు రోజుల వరకు కూడా ట్యాంకర్ రావడం లేదంటూ కొందరు వాపోతున్నారు. పోలీస్స్టేషన్ల ఆవరణలో బోర్లు ఉన్నాయి. కొన్నిచోట్ల కృష్ణా వాటర్ కనెక్షన్లు ఉన్నాయి.
కాగా వచ్చే మంచి నీరు తక్కువగా రావడం, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో కొందరు నీటి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. c, గచ్చిబౌలి తదితర ఠాణాలలో నీటి సమస్యలు ఉన్నాయి. గచ్చిబౌలి ఠాణాలోని సమస్యపై అక్కడి అధికారులను ఆరా తీయడంతో వేసివి తీవ్రత కారణంగా ఉన్న బోరు పనిచేయడం లేదని, ట్యాంకర్ల ద్వారా నీరు సమకూర్చుకుంటున్నామని తెలిపారు. బోరు పనిచేసేంత వరకు వారానికి రెండు ట్యాంకర్లు అవసరం ఉంటాయని వివరించారు. అలాగే, మూడు రోజుల కిందట బోరు పనిచేయకపోవడంతో వాటర్ సమస్య వచ్చిందని, ట్యాంకర్ తెప్పించుకోవడంతో నీటి సమస్య తీరిందని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు వెల్లడించారు.