సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): జలమండలి నుంచి వచ్చే తాగు నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని బజారాహిల్స్ రోడ్ నంబర్ 14 శ్రీవెంకటేశ్వర నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని కేఎల్ టవర్ గల్లీ మొత్తానికి నీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రోజుకు కనీసం ఒక గంట పాటు కూడా తాగునీరు రావడం లేదని… ఇదే పరిస్థితి నెలల తరబడి కొనసాగుతున్నా జలమండలి అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు.
కాలనీకి నీటిని సరఫరా చేసే లైన్మెన్ మద్యం తాగి విధుల్లోకి వస్తున్నారని.. మద్యం మత్తులో రోజుకు గంట కంటే ఎక్కువ సరఫరా చేయడంలేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని జలమండలి మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పందించి కాలనీకి తాగు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు.