‘నగరం నడి బొడ్డున ప్రవహిస్తున్న ప్రధానమైన కూకట్పల్లి, బేగంపేట, జీడిమెట్ల నాలాల్లో కాలుష్య కారక రసాయనాలు నామమాత్రంగానే ఉన్నాయి. నీటిలో కరిగిన రసాయనాల వల్ల ప్రమాదం పెద్దగా లేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల కంటే ఎక్కువ మోతాదులో కాలుష్యాన్ని కలిగించవు.’ ఇది తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రాత్రిళ్లు చేసే పెట్రోలింగ్ తనిఖీల్లో సేకరించిన నీటి శాంపిళ్లను పరీక్షించి తేల్చిన రిపోర్టు. అధికారులేమో ఆయా నాలాల్లో కాలుష్య కారకాలు లేవని చెబుతుంటే ఆయా నాలాల పరిసరాల్లో నివసించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముక్కుపుటాలదిరే ఘాటైన వాసన, గాలిలో కలిసిన రసాయనాల వల్ల కలిగే వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– సిటీ బ్యూరో, జూలై 3
(నమస్తే తెలంగాణ): పారిశ్రామిక వాడల నుంచి నగరం వీధుల గుండా ప్రవహించే కూకటపల్లి నాలా, జీడిమెట్ల నాలా, బేగంపేట నాలాల్లోకి నిత్యం పెద్ద ఎత్తున పరిశ్రమల వ్యర్థాలు, రసాయనాలు విడుదలవుతున్నాయి. ఆయా పరిశ్రమల యజమానులు వ్యర్థాలను వదలకుండా నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలికి చెందిన టాస్క్ఫోర్స్ బృందం నాలాల నుంచి నీటి నమూనాలను సేకరిస్తుంది. శాంపిళ్లను పీసీబీలోని సెంట్రల్ ల్యాబ్లో పరీక్షించి హానికర రసాయనాలు, నీటి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎలా ఉందో నిర్ధారిస్తారు. పీసీబీ అధికారులు జూన్ 1 నుంచి 19 వరకు సేకరించిన శాంపిళ్లలో సీఓడీ, బీఓడీతో పాటు రసాయనాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని తేల్చారు. నాలాల్లో కాలుష్య కారకాలు లేవని చెబుతుంటే ఆయా నాలాల పరిసరాల్లో నివసించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
గ్రేటర్లో ప్రధాన మురుగు నీటి కాల్వలు కూకట్పల్లి, జీడిమెట్ల, బేగంపేట నాలాలు. వీటి ద్వారా ప్రవహించిన మురుగు అంతిమంగా మూసీలో కలుస్తున్నది. ఈ నాలాలు ప్రధాన పారిశ్రామిక వాడలైన జీడిమెట్ల, సనత్నగర్ పరిసరాల నుంచి ప్రవహిస్తుండటంతో ఆయా పరిశ్రమల యజమానులు ఇష్టానుసారంగా రసాయన వ్యర్థాలను వదులుతున్నారు. దీంతో ఆయా నాలాల పరిసరాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో రసాయనాలు గాలిలో కలిసి చర్మవ్యాధులతో పాటు పలు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. దుర్వాసన భరించ లేక అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే చాలు పరిశ్రమల నుంచి వ్యర్థాలను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో మరింత ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలాల నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇండ్లలో ఉండలేకపోతున్నాం. ఎండాకాలంలో రసాయనాలు, స్పిరిట్ వాసన ముక్కుపుటాలదిరేలా వస్తుంది. దీంతో శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి. గాలిలో రసాయనాలు కలిసి చర్మంపై పడటంతో దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. పిల్లలు తరచూ జ్వరం బారిన పడుతున్నారు. వర్షాకాలం వస్తే నాలా నీళ్లు నురగలు కక్కుతూ ప్రవహిస్తున్నాయి. పరిశ్రమల యజమానులు వరదకు ఎక్కువగా వ్యర్థాలను వదులుతుంటంతో నురగలు వస్తున్నాయి. ఆ నురగల తుంపర్లు గాలికి ఇండ్లలోకి వస్తుండటంతో వస్తువులు రంగు మారుతున్నాయి. గోడలకు వేసిన రంగులు కూడా తొందరగా పోతున్నాయి. అధికారులు నాలాలో రసాయనాలను కలవకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే మా ప్రాణాలకే ప్రమాదంగా మారనుంది.
– మాతాజీ నగర్ నివాసి, బేగంపేట
నాలాల్లోకి వచ్చే రసాయనాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. నగరంలో ప్రవహించే మూసీ నదితో పాటు ప్రధాన నాలాల్లోకి పరిశ్రమల వ్యర్థాలు రాకుండా నియంత్రించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలి. రసాయనాలు చేరడం వల్ల నగరంలో నాలాల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీలు ఎన్ని ఉన్నా వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వాటివల్ల ఏం ప్రయోజనం లేకుండా పోతున్నది. వ్యర్థ జలాలను ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి మళ్లీ మూసీ, హస్సేన్సాగర్లోకే వదులుతున్నారు. దీంతో వాటిలోకి వచ్చే వ్యర్థాలతో కలిసిపోయి మళ్లీ మురుగునీరుగా మారుతున్నాయి. మురుగు నీటి నిర్వహణ పక్కాగా, పకడ్బందీగా నిర్వహిస్తే సమస్య ఎక్కడా ఉండదు.
– ప్రొఫెసర్ సాయిభాస్కర్రెడ్డి, పర్యావరణవేత్త