Hyderabad | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 22 (నమస్తే తెలంగాణ): చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఒక ఉమ్మడి కుటుంబం గతేడాది చివరలో గృహ ప్రవేశం చేశారు. పది రోజుల కిందటి వరకు కలల సౌధంలో సంతోషంగా ఉన్నారు. ఒక్కసారిగా ఇంట్లోని బోరు ఒట్టిపోయింది. బిల్డర్ 500 ఫీట్ల వరకు వేయడంతో అదనంగా మరో 300 ఫీట్లు వేయించారు. కానీ చుక్క నీరు రాలేదు. నల్లా కనెక్షన్ ఉన్నా వచ్చే నీళ్లు సరిపోవడం లేదు. దీంతో సమీపంలోనే రూ.20వేలు పెట్టి మరో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడా అదే పరిస్థితి.
దీంతో రెండు రోజుల కిందటే రెండు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వారానికి ఒకసారి జలమండలి మంచినీటి సరఫరా జరుగుతున్నది. పలు కాలనీల్లో బోర్లు రోజులో ఒక గంటపోసి ఆగిపోతుండటంతో జనం ఆ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. మరికొన్నిచోట్ల ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో జలమండలి ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. కానీ రోజుల తరబడి టోకెన్ నంబరు ముందుకు కదలక చివరకు రూ.1000-1500 వెచ్చించి ప్రైవేటు ట్యాంకర్లు తెచ్చుకుంటున్నారు.
వెస్ట్‌జోన్ పరిధిలోని తదతర ప్రాంతాల్లోని జలమండలి ట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రాల్లో గత 20-25 రోజులుగా ట్యాంకర్లకు డిమాండు గణనీయంగా పెరిగింది.
గతంలో కంటే ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో అధికారులు ట్యాంకర్లను ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నా.. డిమాండుకు అనుగుణంగా లేక ప్రైవేటు నీటి వ్యాపారం మూడు పూవ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. ఈ ప్రాంతంలో దాదాపు 22వేల మంది పదేపదే జలమండలి ట్యాంకర్లను బుక్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. హైదరాబాద్ మహా నగరానికి మంచినీటి ముప్పు ముంచుకొచ్చిందనేందుకు కొన్ని ఉదాహరణ మాత్రమే ఇవి. భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో పడిపోవడంతో పరిస్థితి నానాటికీ సంక్లిష్టంగా మారుతున్నది.
అవుటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 948 చదరపు కిలోమీటర్లలో సాంకేతిక నిపుణులతో జలమండలి జరిపిన సర్వేలో కేవలం 27 చదరపు కిలోమీటర్లు మినహా, మిగిలిన 921 చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో పడిపోయినట్లుగా తేలిందని సమాచారం. జలమండలి పరిధిలో మునుపెన్నడూలేని రీతిలో ట్యాంకర్ల డిమాండు పెరగడంతో అధికారులు ఈ సర్వే చేయించినట్లుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తాము గతంలో కంటే రెట్టింపు స్థాయిలో ట్యాంకర్లను పెట్టి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ… అసలు ఈ పరిస్థితి అందునా ఎండా కాలం ప్రారంభంలోనే ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ఆందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది.
గతేడాది హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి పరిధుల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం పడినప్పటికీ ఈ పరిస్థితి రావడం అధికార యంత్రాంగాన్ని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రధానంగా ఐటీ కారిడార్, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా గతంలో కంటే 100-150 శాతం ఎక్కువ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే రానున్న రెండు నెలల పాటు పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందోనని అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ప్రస్తుతం ఉన్న వాటికంటే ట్యాంకర్లను పెంచడంతో పాటు అదనపు ఫిల్లింగ్ కేంద్రాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా, పలుచోట్ల జలమండలి సిబ్బంది దీపం ఉండగానే అన్నట్లుగా ట్యాంకర్లను పక్కదారి పట్టించి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వినియోగదారులకు రెండు, మూడు రోజులకైనా దక్కాల్సిన ట్యాంకర్ నీళ్లు ఐదారు రోజులు కొన్ని ప్రాంతాల్లో వారం, పది రోజులకుగానీ అందడం లేదు.
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బాలాజీనగర్, ఎంఆర్ఆర్ తదితర కాలనీలకు చెందిన ప్రజలు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగారు. బాలాజీనగర్, ఎంఆర్ఆర్ కాలనీల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలకు నాలుగైదు రోజులకోసారి కూడా మిషన్ భగీరథ నీళ్లు రాని పరిస్థితి ఉందన్నారు. నీళ్లు లేని కారణంగా ఒక్కో రోజు స్నానం కూడా మానేయాల్సి వస్తున్నదన్నారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ తో నీళ్ల సమస్య అనేది లేకుండా చేసిందన్నారు.
మిషన్ భగీరథ నీళ్ల రాక, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు సరిపోక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తున్నదన్నారు. అనేక సార్లు అధికారుల దృష్టికి నీటి సమస్య తీసుకువచ్చినా.. స్పందించకపోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందన్నారు. అనంతరం కమిషనర్ నాగిరెడ్డి కాలనీవాసులతో కార్యాలయ సమావేశ మందిరంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్, కాలనీవాసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
మూడు రోజుల్లో నీళ్ల సమస్య పరిష్కరించకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని, కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. కమిషనర్ ఇందుకు సమాధానమిస్తూ మూడు రోజుల్లో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మిషన్ భగీరథ నీళ్లు తక్కువగా వస్తుండటంతో నీటి సమస్య తలెత్తందన్నారు. ఇప్పటికే ఉన్న బోరు బావులను బాగు చేయిస్తామని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, వర్తక సంఘం నేత సుధాకర్ గుప్త, స్థానికులు శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, చకిలం చంద్రశేఖర్, నర్సింహారెడ్డి, యతేంద్రనాథ్, నీలిమ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భూగర్భజలాలు అడుగంటుతుండటంతో జలమండలి నీటి సరఫరా వ్యవస్థపై భారం మరింతగా పెరుగుతున్నది. ఈ క్రమంలో ట్యాంకర్లకు డిమాండు రెట్టింపు కంటే ఎక్కువ కావడం, అటువైపు నీటిని మళ్లించడంతో గృహాలకు జరిగే నీటి సరఫరాలో పరిమాణం సన్నగిల్లుతున్నది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకంగా వారం రోజులకోసారి జలమండలి నీటిసరఫరా జరగడంలేదంటే పరిస్థితి ఎంత విషమంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతాలు శివారు మున్సిపాలిటీలుగా ఉన్నప్పుడు వారం, పదిరోజులకోసారి మంచినీటి సరఫరా జరిగేది. కానీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేసవి కాలంలోనూ ఈ ప్రాంతంలో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరిగేది. కాగా, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోనూ జలమండలి సరఫరా నీటి సరఫరాలో లోప్రెషర్‌తో జనం అవస్థలు పడుతూనే ఉన్నారు.
హైదరాబాద్ తాగునీటి సరఫరాలో ఏకంగా 48-50 శాతం పరిమాణాన్ని సరఫరా చేసే నాగార్జునసాగర్ నీటిమట్టం గుబులు పుట్టించే స్థాయిలోకి వెళ్లిపోతున్నది. నాలుగైదు రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు 20-30వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో సాగర్ నుంచి రోజుకు రెండు టీఎంసీల వరకు ఏపీ, తెలంగాణ డ్రా చేస్తున్నా నీటిమట్టం 519 స్థాయిలో కొనసాగుతున్నది. శ్రీశైలంలో మరో ఐదు టీఎంసీలు ఖాళీ అయితే పవర్ హౌస్‌ల నుంచి విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదు.
అంటే సాగర్‌లో మరో రెండు రోజులు నీటిమట్టం స్థిరంగా ఉండే సూచనలున్నాయి. కాగా తెలంగాణ, ఏపీ సాగునీటి అవసరాలు భారీగానే ఉన్నా సర్దుబాటుకు సిద్ధమైనా ఏప్రిల్ చివరి నాటికి కనిష్ఠంగా 50 టీఎంసీల వరకు తీసుకుంటేనే పంటలు గట్టెక్కుతాయి. ఆస్థాయిలో నీళ్లు ఖాళీ అయితే సాగర్ నిల్వ ప్రస్తుతం ఉన్న 148 టీఎంసీల నుంచి వందలోపునకు పడిపోతుంది. తీవ్ర దుర్భిక్ష సమయాల్లోనూ సాగర్‌లో నీటి నిల్వ ఈ స్థాయిలో పడిపోయిన దాఖలాలు లేవు. దీంతో ఇటు సాగుకు కోత పెట్టి తాగునీటిని గట్టెక్కించాలా? లేదా పంటలను కాపాడి తాగునీటి గండానికి సిద్ధపడాలా? అనే క్లిష్టమైన సవాల్ ముందున్నది. తాగునీటి కోసం గోసపడుతున్నాం.