GHMC | సిటీబ్యూరో: గ్రేటర్లో వరదల వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్న క్రమంలో ప్రధాన రహదారులపై నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారానికి హోల్డింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో తెలిపారు. నగర వ్యాప్తంగా 18 లొకేషన్లలో 23 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. లక్ష లీటర్ల సామర్థ్యం నుంచి 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ హోల్డింగ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదించామన్నారు.
ఇందుకోసం గ్రేటర్ వ్యాప్తంగా 100 కోట్ల అంచనా వ్యయంతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వరద నీరు నిల్వకుండా 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందం, 252 స్టాటిక్ బృందాలు పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. ఇప్పుడున్న 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లను భవిష్యత్లో 50 పాయింట్లకే పరిమితం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.