సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వ ఆదేశాల అమలులో జలమండలి అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. మొండి నీటి బకాయిదారులకు లబ్ధి జరిగేలా ఓటీఎస్ జీవో వెలువడి 17 రోజులు దాటినా.. వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. జీవో వచ్చినా.. అమలేదీ అన్న శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో అధికారుల లోపాలను ఎత్తిచూపుతూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు రోజంతా ఓటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర కసరత్తు చేశారు.
సంస్థ ఎండీ, ఈడీలు, రెవెన్యూ విభాగం అధికారులతో కలిసి అన్ని డివిజన్ల జీఎంలతో సమీక్షలు జరిపారు. ఓటీఎస్ అర్హుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేసి 6.90 లక్షల మంది అర్హులు అని తేల్చారు. మొత్తంగా డొమిస్టిక్, డొమిస్టిక్ స్లమ్, కమర్షియల్, ఇండస్ట్రీయల్, ఎంఎస్బీ, బల్క్, కాలనీలు, ప్రభుత్వ, కేంద్ర రంగ సంస్థలు కలిపి ఓటీఎస్ స్కీం వర్తింపజేయగా..వీటీ నుంచి రూ.2650 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా చేశారు. ఓటీఎస్ జీవో గడువు మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తున్నది. అయితే జీఎంలకు డివిజన్ల వారీగా అర్హుల జాబితా, యాప్ విధానం అమలుపై అవగాహన కల్పించిన అధికారులు.. మంగళవారం (నేటి) నుంచి వినియోగదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్లకు పంపనున్నారు.