భూగర్భ జలాలను పెంపొందించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఇంటింటికీ ఇంకుడు గుంతల కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకునేందుకు జలమండలి అష్టకష్టాలు పడుతున్నది. కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా.. అధికారుల నిర్లక్ష్యంతో సగానికి పరిమితమైంది. వర్షపు నీటిని ఒడిసి పట్టాలనే ప్రణాళిక నీరుగారిపోయింది. నగరంలో పెరుగుతున్న కాంక్రీటీకరణను అధిగమించేందుకు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని జలమండలి క్షేత్ర స్థాయి అధికారులు అటకెక్కించారు.
ఒప్పటిదాకా ఒక్క డివిజన్లో కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి, టార్గెట్లను నిర్దేశించినా క్షేత్రస్థాయి సిబ్బందిలో కదలిక ఉండటం లేదు. అటు ఇంకుడు గుంతల ప్రాముఖ్యంపై నగర ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ జలమండలి పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల్లో ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించకపోవడం వల్లే లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.
-సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతున్నది. ప్రతిపాదించిన అన్ని ఇంకుడు గుంతలను పూర్తి చేస్తే భూగర్భ జలాల క్షీణత కొంతమొత్తంలోనైనా తగ్గేది. నగరంలో భానుడు ఉగ్రరూపం చూపిస్తుండటంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా నీటి ఎద్దడితో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. జలమండలి సరఫరా చాలినంత లేకపోయినా బోర్లమీద ఆధారపడదామంటే అవీ అడుగంటి పోతున్నాయి.
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉంటే జలమండలి నీళ్లు చాలినన్ని రాకున్నా..వేసవిలో బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉండేవి. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకుడు గుంతలపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డివిజన్ల స్థాయిలో క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. ఉన్నతాధికారులు మాత్రం ఇంకుడుగుంతల కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా క్షేత్రస్థాయిలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈనెల 31 నాటికి జలమండలి పరిధిలోని వినియోగదారుల ఇండ్లలో 30 వేల ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా జలమండలి సొంత నిధులతో మరో 700 గుర్తించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఏడాదిన్నర అవుతున్నా 30 వేల ఇంకుడు గుంతల్లో కేవలం సుమారు 16 వేలు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా జలమండలి నిర్దేశించిన వాటిలో 190 పూర్తయ్యాయని, మరో 180 నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆ పనులు కూడా ఆగుతూ సాగుతూ నడుస్తున్నట్లు తెలుస్తున్నది.