ఖైరతాబాద్, ఆగస్టు 1 : వర్షాకాలం వచ్చిందంటే.. ఆ బస్తీ పోయే దారి చెరువులా మారిపోతుంది. నడుములోతు నీరు చేరి ప్రమాదకరంగా మారుతుంది. నాలాలో పదే పదే వ్యర్థాలు పేరుకుపోతున్నా సకాలంలో వాటిని తొలగించకపోవడంతో అది శాశ్వత సమస్యలా పరిణమించింది. ఖైరతాబాద్ డివిజన్లోని తుమ్మలబస్తీలో ఉన్న బల్కాపూర్ నాలా మళ్లీ వ్యర్థాలతో నిండిపోయింది.
గత నెల భారీ వర్షాల నేపథ్యంలో వ్యర్థాలను పూర్తిగా తొలగించకుండా అసంపూర్ణంగా వదిలివేసి కేవలం నీరు మాత్రం పోయేలా చేశారు. ఫలితంగా మళ్లీ వ్యర్థాలు పేరుకుపోయి నాలా మూసుకుపోయింది. దీనిని నిత్యం పర్యవేక్షించాల్సిన సర్కిల్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో తీరని సమస్యగా మిగిలిపోయింది.
నాలాల డీసిల్టింగ్ పనులు ఎండా కాలం పూర్తయ్యే లోగా ముగించాల్సి ఉంటుంది. అందుకు లక్షలాది రూపాయల బడ్జెట్ సైతం జీహెచ్ఎంసీ కేటాయిస్తుంది. బల్కాపూర్ నాలా డీసిల్టింగ్ కోసం నిధులు సైతం మంజూరు కాగా, ప్రతి ఏడాది అవి పక్కదారి పడుతుండడంతో నాలాలు బాగుపడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో కొందరు అధికారుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. గడిచిన పదేండ్ల కాలంలో ఎందరో జీహెచ్ఎంసీ కమిషనర్లు మారారు….అనేక మంది డిప్యూటీ కమిషనర్లు, ఇతర విభాగాలకు చెందిన వారు బదిలీ అయ్యారు.
కానీ అర్థ దశాబ్దం కంటే ఎక్కువ సమయంలో సర్కిల్- 17లో కొందరు అధికారులు ఇక్కడే తిష్టవేసుకొని కూర్చోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని స్థానిక ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. లాంగ్ స్టాండింగ్ అధికారుల అవినీతి అక్రమాల వల్లే ఆ విభాగానికి సంబంధించిన అనేక పనులు పెండింగ్లో ఉంటున్నాయని చెబుతున్నారు. ఫలితంగా ఈ సారిగా కూడా సమస్యలు పరిష్కారమయ్యే మార్గం కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి బల్కాపూర్ నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.