GHMC | అబిడ్స్, మార్చి 20 : జీహెచ్ ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలో ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు వారెంట్లను జారీ చేస్తున్నారు. మొత్తం టార్గెట్ 93 కోట్లు ఉండగా ఇప్పటివరకు 55 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. అయితే ఆస్తి పన్ను ఎక్కువగా బకాయి పడిన 112 మందికి వారెంట్లను జారీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ లావణ్య తెలిపారు. వారెంట్లు జారీ చేసినా స్పందించని 62 ఆస్తులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
సిటీ సెంటర్ మాల్ బకాయి రూ.2 కోట్లు
ఖైరతాబాద్: ఆస్థి పన్నుల ఎగవేతదారులపై జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరిస్తోంది. సంవత్సరాల తరబడి పన్ను చెల్లించకుండా ఎగవేసిన ఓ భవనాన్ని సీజ్ చేసేందుకు యత్నించగా, సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు చెల్లించడంతో అధికారులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే సర్కిల్ 18 పరిధిలోని బజంరాహిల్స్ రోడ్ నం.1లో హెచ్ఎఎఫ్సీ బ్యాంకు ఉన్న భవనానికి భారీగా పన్నులు పెండింగ్ ఉండడంతో రెడ్ నోటీసులు, వారెంట్లు సైతం జారీ చేసినా బేఖాతరు చేశారు. దీంతో గురువారం అధికారుల బృందం ఆ భవనాన్ని సీజ్ చేసేందుకు వెళ్లింది. అధికారులు వెంటనే చెల్లించాల్సిందిగా కోరగా, కట్టేందుకు కొంత వెనుకడుగు వేయడంతో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ఎట్టకేలకు యజమాని రూ.43,83,901 ఆస్తి పన్ను బకాయిలను చెల్లించడంతో వెనుకదిరిగారు. అలాగే బంజారాహిల్స్ సిటీ సెంటర్ మాల్ సైతం రూ.2కోట్ల వరకు ఆస్తి పన్ను పెండింగ్‌లో ఉందని, సకాలంలో చెల్లించకుండా ఆ మాల్‌ను సైతం సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
బడంగ్‌పేట వెనుకంజ
బడంగ్ పేట: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి పన్నుల వసూలు జాప్యంపై అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రాపర్టీ టాక్స్ డిమాండ్‌కు అనుగుణంగా పన్ను వసూలు చేయలేదని సీడీఎంఏ బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్‌ను అనేకసార్లు మందలించినట్లు సమాచారం. గత సంవత్సరం రూ. 25 కోట్ల డిమాండ్ ఉండగా 18.62 కోట్లు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. ఈ సంవత్సరం 39.52 కోట్ల డిమాండ్ ఉండగా, 14.52 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక మిగిలిన ఎనిమిది రోజుల్లో అధికారులు 100 శాతం పన్ను వసూలు చేసే పరిస్థితి లేదు.