రవీంద్రభారతి, మార్చి 25: నాలుగు దశాబ్దాలుగా బీసీ నేతగా బీసీ ఉద్యమాలు చేస్తున్నానని చెప్పుకుంటూ, అగ్రకుల ప్రభుత్వాలతో కొట్లాడకుండా బీసీ ఉద్యమాలను తాకట్టు పెట్టి వ్యక్తిగత పదవులు పొందిన ఘనత బీజేపీ నాయకుడు ఆర్.కృష్ణయ్యకే దక్కిందని, అందుకే ఆయన త్యాగ కృష్ణయ్య..రాజీ కృష్ణయ్య అని ఐక్యవేదిక బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ విద్యార్థి, యువజన, సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు.
బీసీ ఉద్యమాలను అనునిత్యం తాకట్టు పెట్టిన వారే.. బీసీల కోసం నిజాయితీగా పనిచేస్తున్వ వారిని దొంగలుగా చిత్రీకరించాలని చూస్తున్నారని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ముఖ్య నాయకులపై ఆర్.కృష్ణయ్య తన అనుచరులను ఉసిగొల్పుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ రాళ్లతో కొట్టి, మాఫియాతో చంపిస్తామంటూ బహిరంగంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆర్ కృష్ణయ్య తన అనుచరులతో బెదిరింపులు ఆపకపోతే త్వరలోనే హైదరాబాద్‌లో బీసీ మేధావులు, కులసంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతో కలిసి బీసీ దర్బార్ ఏర్పాటు చేసి కృష్ణయ్య చీకటి మాఫియా రాజకీయాలను, భూదందాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమాజానికి వివరిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. రావులకోల్ సరేశ్ ప్రజాపతి, సింగం సురేశ్, బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నరసింహనాయక్, శ్రీనివాస్‌గౌడ్, మాదేశి రాజేందర్, నాగరాజుగౌడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.