సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వార్డు పాలన ఈ నెల 16 నుంచి అమలు కానుంది. ఈ నెల 10న ప్రారంభించాలని భావించినా.. అదే రోజున మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఉన్నతాధికారులు, వార్డు కార్యాలయ నోడల్ ఆఫీసర్లకు హైటెక్స్‌లో ఓరియెంటేషన్ క్లాస్ నిర్వహిస్తున్నారు. వార్డు కార్యాలయాల లక్ష్యాలను అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో దశాబ్ది ఉత్సవాలలో పట్టణ ప్రగతి పేరిట జరిగే కార్యక్రమంలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 16న (శుక్రవారం) వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నారు.