సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకుని ఉద్యోగాలు కల్పించాలని ఇచ్చిన జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వీఆర్ఏలు, వారి కుటుంబసభ్యులు తరలివచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని మంత్రుల నివాసాలను ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పోలీసులు వీఆర్ఏలను మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర వరకు వెళ్లనివ్వకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. 3797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి వందలాది మంది వీఆర్ఏలు ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మొహరించిన బంజారాహిల్స్ పోలీసులు వారిని అడ్డుకున్నా పట్టించుకోకుండా వందలాది మంది వీఆర్ఏలు మంత్రుల క్వార్టర్స్ వద్దకు చేరుకొని లోనికి ప్రవేశించేందుకు యత్నించారు.వారిని పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
మహిళను ఈడ్చేసిన పోలీసులు
ఇదిలా ఉండగా మంత్రుల నివాసాల ముట్టడికి యత్నించిన వీఆర్ఏల ఆందోళనలో పాల్గొన్న వారిలో 98 మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. మరోవైపు మినిస్టర్ క్వార్టర్స్ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల నివాసాల ముట్టడికి తరలివచ్చిన వీఆర్ఏలపై తమ బలం చూపించారు. మంత్రుల నివాసాల్లోకి వారిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలోనే మహిళలని చూడకుండా ఈడ్చేశారు. అంతేకాదు తన ప్రాణం బాగాలేదని, హార్ట్ ప్రాబ్లమ్ ఉందని, కాళ్లు మొక్కుతా.. వదిలేయండంటూ పోలీసుల కాళ్లా వేళ్లాపడ్డా కూడా వారు కనికరించలేదు. తనను లాగొద్దంటూ ఆ మహిళా వీఆర్ఏ ఎంత మొత్తుకున్నా పోలీసులు ఆమెను ఈడ్చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీఆర్ఏలు, వారి కుటుంబసభ్యులపై పోలీసుల జులుం విమర్శలకు దారితీసింది.
పట్టించుకోవడం లేదు
– వీఆర్ఏ జేఏసీ కో కన్వీనర్ వంగూరు రాములు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీఆర్ఏలకు పే స్కేల్‌తో పాటు వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 81, జీవో 85లను విడుదల చేసింది. వారిలో 16,758 మందికి వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించారు. అయితే 3797 మంది వీఆర్ఏల వారసులకు సంబంధించిన ఉద్యోగాలు పెండింగ్‌లో పెట్టారు. 15 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వీఆర్ఏల ఉద్యోగాల విషయంలో నాన్చివేత ధోరణితో వేలాది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో వీఆర్ఏలు ఆందోళన చేసిన సమయంలో తమది న్యాయమైన డిమాండ్ అని మద్దతు పలికిన కాంగ్రెస్ నేతలు,అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినప్పటికీ తమ న్యాయమైన కోరికలను ఇప్పటికీ తీర్చలేదు సరికదా.. అసలు పట్టించుకోవడం లేదు.
ఇదేనా ఇందిరమ్మ పాలనా..
– బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రులకు విన్నవించడానికి వచ్చిన వీఆర్ఏలపై ప్రభుత్వ అనుసరించిన వైఖరి, పోలీస్ జులుంను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి అండగా ఉండి ప్రభుత్వం మెడలు వంచైనా వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. ఇదేనా ప్రజాపాలన.. ప్రజాపాలన అంటూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజాసమస్యలు వింటామని, నిలబడ్డచోటే పరిష్కారం చేస్తామని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పీడితులు, బాధితులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే ఇలా చొరబాటుదారులు, సంఘవిద్రోహులు, తీవ్రవాదులను అణచివేసినట్లు దాడులు చేస్తున్నారు.