సిటీబ్యూరో, నవంబరు 10 (నమస్తే తెలంగాణ ) : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ఈ హక్కును జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విస్మరిస్తున్నారు. కనీసం సగం మంది కూడా ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎన్నిక రోజును సెలవుదినంగా మార్చుకుని విహార యాత్రలు, ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటూ ఓటు వేయడంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా ఓటింగ్ శాతం కనీసం 50 శాతం దాటడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాల దాకా ఓటర్లను రప్పించడంలో ఆయా రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి. ఎప్పటిలాగే జిల్లా ఎన్నికల సంఘం అధికారులు ఓటర్లకు అవగాహన, చైతన్యం కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలంటూ స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సారైనా మార్పు వచ్చేనా?
సాధారణంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో సమస్యలు పెరిగిపోవడం, అభివృద్ధి ఆశాజనకంగా లేకపోవడం, రాజకీయ పార్టీల పట్ల విముఖతనే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడిచిన రెండేళ్లుగా ఎక్కడి వేసినా గొంగళి అక్కడే ఉన్నట్లుగా సమస్యలు అడుగడుగునా తాండవిస్తున్నాయి.నియోజకవర్గంలోని బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళ్రావు నగర్ కాలనీ, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, సోమాజిగూడ తదితర ఏడు డివిజన్లు ఉండగా, ఈ ఏడు డివిజన్లలో వెంగళ్రావునగర్లో మాత్రమే ఎగువ, మధ్య తరగతి కాలనీలు ఉండగా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో బస్తీలు, మురికివాడలు, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు నివసిస్తున్నారు.
అయితే ఏ బస్తీల్లో, ఏ కాలనీలో చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా దెబ్బ తిన్న రహదారులు, పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు, పడకేసిన పారిశుద్ధ్యం, వీధికుక్కల బెడద, దోమల స్వైర విహారం, నీటి ఎద్దడి, ఫుట్‌పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్ జామ్ ఇలా అనేక సమస్యలతో నియోజకవర్గ ప్రజలు సతమతమవుతున్నారు. ఈ తరుణంలోనే రెండేళ్ల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, ఓటు ద్వారా గుణపాఠం చెబుతామన్న చర్చల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
