సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రోజురోజుకూ రెచ్చిపోతూ దారుణాలకు పాల్పడుతున్నారు. వరుస ఘటనలతో సిటీలో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా రెండురోజుల్లో రెండు ఘటనలు జరగడం, అది కూడా నగరం నడిబొడ్డున ఒకరిపై, వేలాది మంది ప్రయాణించే ఎంఎంటీఎస్ ట్రైన్లో మరొకరిపై జరిగిన అత్యాచారయత్నాలతో దుండగులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
సోమవారం సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. మేడ్చల్‌లోని హాస్టల్లో ఉంటున్న అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతి(23) సెల్‌ఫోన్ పాడవ్వడంతో రిపేర్ కోసం శనివారం రాత్రి సికింద్రాబాద్‌కు వచ్చింది. సెల్‌ఫోన్ బాగు చేయించుకున్న తర్వాత తిరిగి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్ బయలుదేరింది. మహిళల కోచ్ అయితే సురక్షితమనుకున్న ఆ యువతి అందులో ఎక్కింది. కోచ్‌లో తనతో పాటు ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్‌లో దిగిపోయారు. తాను మాత్రం ఒంటరిగా కూర్చుంది. నల్లచొక్కా వేసుకున్న ఓ దుండగుడు కొంపల్లి దగ్గర మహిళల కోచ్‌లోకి ఎక్కాడు.
యువతి దగ్గరకు వచ్చి టీజ్ చేశాడు. ఆ తర్వాత ఆ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసింది. కొంపల్లి దాటిన తర్వాత వంతెన వద్ద పడిపోయిన ఆమెకు తీవ్రగాయాలు కావడంతో జీఆర్పీ పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు చెప్పారు.
అయితే యువతి చెబుతున్నదాని ప్రకారం దుండగుడు ఎప్పుడు ఆ బోగీలోకి వచ్చాడో గమనించలేదని, అల్వాల్‌లో ఇద్దరు మహిళలు దిగిపోయిన తర్వాత ట్రైన్ కదలగానే తనను గట్టిగా పట్టుకున్నట్లు యువతి పోలీసులకు తెలిపింది. దీంతో అతడిని ప్రతిఘటించి ట్రైన్ నుంచి దూకేసినట్లు ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్పీ చందనాదీప్తి ఈ కేసును చాలా సీరియస్‌గా పర్యవేక్షిస్తున్నారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తే అసలు సికింద్రాబాద్‌లో తప్ప.. మిగతా చోట్ల సీసీ కెమెరాలు లేవని, కొన్నిచోట్ల ఉన్నా అవి పనిచేయట్లేదని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దవడ వద్ద తీవ్రగాయమైందని, పై పళ్లు ఊడిపోవడంతో మాట్లాడడం కష్టమవుతున్నదని బాధితురాలి సోదరుడు చెప్పారు.
పనిచేయని కెమెరాలు..
కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడిని గుర్తించడం పోలీసులకు కష్టమవుతోంది. మరోవైపు పోలీసులకు నిందితుడికి తాలూకు ప్రయాణ వివరాలు కూడా తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఓ అధికారి చెప్పారు. ఇదిలాఉంటే నిందితుడు యువతికి ముందే తెలిసిన వాడా.. లేక ఆమెను వెంబడిస్తూ వచ్చాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం స్టేషన్‌తో కనెక్టివిటీ ఉన్న సీసీ ఫుటేజీ అంతా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నాలుగు బృందాలతో ..
అన్ని స్టేషన్లు, అన్ని బోగీల్లో సీసీ కెమెరాలు లేవని రైల్వే ఎస్పీ చందనాదీప్తి చెప్పారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి నాలుగు బృందాలు వేసి గాలింపు చర్యలు చేపట్టామని చందనాదీప్తి చెప్పారు. ఈ కేసును ఛేదించడం తమకు పెద్ద సవాల్ అని.. అయినా త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటామని చందనాదీప్తి చెప్పారు. ప్రధానంగా ప్రయాణికులు వారి భద్రత వారే చూసుకోవాలని, అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బాలీవుడ్ సహ నటిపై అత్యాచారయత్నం..
ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ సహ నటి హైదరాబాద్‌కు వచ్చిన మూడురోజుల తర్వాత తనపై అత్యాచారయత్నం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసులు కేసు ఛేదించే పనిలో అసలు ఈ ఫిర్యాదే తప్పుడు ఫిర్యాదంటూ ప్రెస్‌నోట్ విడుదల చేయడం సంచలనంగా మారింది. ఓ షాపు ప్రారంభోత్సవం పేరుతో ముంబై నటిని ఆహ్వానించి ఆపై ఆమెను బంధించి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
బాలీవుడ్లో సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న ఓ నటిని ఈనెల 17న హైదరాబాద్‌లోని ఆమె స్నేహితురాలు షాప్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రయాణ ఖర్చులు, పారితోషికం చెల్లిస్తారని చెప్పింది. ఆమె మాటలు నమ్మి ఈనెల 18న హైదరాబాద్‌కు వచ్చిన యువతిని మాసబ్ ట్యాంక్ శ్యామ్నగర్కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో బస ఏర్పాటు చేశారు.
ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలు నటికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చారు. అయితే 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు ముగ్గురు పురుషులు ఆ నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు.ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గట్టిగా అరిచి పోలీసులకు చెబుతానని బెదిరించడంతో వారు పారిపోయారు. ఆ తర్వాత వృద్ధురాలితో పాటు ఇద్దరు మహిళలు వచ్చి ఆమెను కొట్టి తన వద్ద ఉన్న 50వేల రూపాయల నగదు తీసుకొని గదిలో బంధించి వెళ్లిపోయారు.
బాధితురాలు 100కు డయల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన మాసబ్ ట్యాంక్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ముంబైకి చెందిన సహ నటి విషయంలో జరిగిన ఈ ఘటనతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినే అవకాశమున్నందున పోలీసు బాస్‌ల నుంచి స్థానిక పోలీసులకు పెద్ద ఎత్తున చీవాట్లు పడ్డాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకోవాలంటూ పోలీస్ బాస్ సూచించినట్లు సమాచారం.
అది తప్పుడు ఫిర్యాదు
అయితే బాలీవుడ్ సహ నటి కేసులో ఇది తప్పుడు ఫిర్యాదు అంటూ మసబ్ ట్యాంక్ పోలీసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇది తప్పుడు ఫిర్యాదుగా తేలిందని సీఐ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మహిళ ఈనెల 18న బాలీవుడ్ సహ నటితో పాటు మరో ఇద్దరు యువతులను నగరానికి పిలిపించినట్లు తెలిపారు. తన తల్లి సహకారంతో వ్యభిచార గృహం నడుపుతున్న నరేశ్ అనే వ్యక్తి ఇంటికి ఆ ముగ్గురిని తీసుకెళ్లారని చెప్పారు.
ఆ తర్వాత శనివారం హైదరాబాద్‌కు చెందిన మహిళతో పాటు ముగ్గురు యువతులకు మధ్య డబ్బుల చెల్లింపులకు సంబంధించి గొడవ జరిగిందని, దీంతో బాలీవుడ్ సహ నటి వారిపై ఫిర్యాదు చేసి సొంతూరికి వెళ్లిపోయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్‌కు చెందిన మహిళతో పాటు నరేశ్, బాలీవుడ్ సహ నటి, మరో ఇద్దరు యువతుల గురించి గాలిస్తున్నామని, మరో టీమ్‌ను పంకజ్ అనే ముంబై బ్రోకర్‌ను వెతకడానికి పంపించామని పేర్కొన్నారు.