ఖైరతాబాద్, జూన్ 24 : నిమ్స్‌లో జరిగిన, జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలిసింది. దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్యశాలగా గుర్తింపు పొం దిన నిమ్స్‌పై కొంతకాలంగా వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పలు అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతున్నా.. ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన నివేదికలు బయటికి రాకుండా నిమ్స్‌లోని కొందరు పెద్దలు ప్రభుత్వ పెద్దల సాయంతో తొక్కిపెడుతున్నట్టు సమాచారం.
మరోవైపు నిమ్స్ లేబర్ కాంట్రాక్ట్ టెండర్ల ప్రక్రియలో జరిగిన అవినీతి అక్రమాలపై ‘నమస్తే’లో వచ్చిన కథనంపై ఆస్పత్రి వర్గాల తోపాటు ప్రభుత్వ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసినట్టు తెలిసింది. గతంలో నగరంలోని ప్రముఖ సర్కార్ వైద్యశాలలో అక్రమాలకు పాల్పడిన చెన్నైకి చెందిన సంస్థకు అప్పగించడం సర్వ త్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో గత యాజమాన్య పెద్ద, ఇద్దరు వైద్యాధికారులు, ఆ శాఖ పేషీలోని వ్యక్తిగత బాధ్యతలు చూసే వ్యక్తితోపాటు ఇద్దరు మీడి యా ప్రతినిధులకు భారీగా ముడుపులు అం దినట్టు పలువురు ఆరోపించిన నేపథ్యంలో ఈ అంశంపైనూ జోరుగా వైద్య వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. కాగా, లేబర్ కాం ట్రాక్ట్ టెండర్ల వివాదంపై బుధవారం రాష్ట్ర వైద్య కార్యదర్శి ఆరా తీసినట్టు తెలిసింది. అయితే ‘అంతా ఓకే’ అన్నట్లుగా ప్రస్తుత యాజమాన్యం వివరణ ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
కీలక వ్యక్తుల పాత్రపై ఆరా..
గడిచిన రెండేండ్లలో నిమ్స్ దవాఖానలో నూతన పరికరాల కొనుగోలు, వైద్యుల నియామకాలు.. పదోన్నతులు.. కాంట్రాక్టు లు …కేటాయింపులు… తదితర అంశాల్లో జరిగిన అవినీతి అక్రమాల్లో కీలక అధికారులు, వ్యక్తుల పాత్రపై విజిలెన్స్ ఆరా తీసినట్టు తెలిసింది. తాజాగా జరిగిన లేబర్ కాం ట్రాక్ట్ టెండర్ల విషయంలో సాంకేతిక అర్హతల పరిశీలన, మార్కుల కేటాయింపు, ఫైనల్ ఆమోద ప్రక్రియలో ఎవరు ఏ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారనే అంశాలపైనా వివరాలు కూడా సేకరిస్తున్నట్టు సమాచారం.